ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeతెలంగాణఅశ్వారావుపేటకొమరం భీమ్ ఆశయాల స్ఫూర్తితో ఆదివాసి హక్కులు, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం - మంత్రి సీతక్క

కొమరం భీమ్ ఆశయాల స్ఫూర్తితో ఆదివాసి హక్కులు, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం – మంత్రి సీతక్క

📰 Generate e-Paper Clip

 

భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

ఆదివాసీ యువత విద్య, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

అశ్వారావుపేటలో కొమరం భీమ్ విగ్రహావిష్కరణ

అశ్వారావుపేట,ఆగస్టు 9: ప్రపంచివాసీనోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దానసరి అనసూయ (సీతక్క) హాజరయ్యారు. జిల్లాకు విచ్చేసిన మంత్రి సీతక్కకు ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, కొమ్ము డాన్స్‌లతో ఆదివాసీ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్క, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ తదితరులు ఆదివాసీ ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా అశ్వారావుపేట ప్రధాన కూడలికి చేరుకున్నారు.

అశ్వారావుపేట ప్రధాన కూడలిలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొమరం భీమ్ విగ్రహాన్ని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం కోసం కొమరం భీమ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. అశ్వారావుపేటలో కొమరం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఆదివాసీ జేఏసీ నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.

ఆదివాసీల పోరాట చరిత్ర ఎంతో గొప్పదని మంత్రి తెలిపారు . కాకతీయుల పాలనకు వ్యతిరేకంగా సమ్మక్క-సారలమ్మ చేసిన పోరాటం నుంచి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు, నిజాం పాలనకు వ్యతిరేకంగా కొమరం భీమ్ చేసిన పోరాటాల వరకు ఆదివాసీలు తమ హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం నిరంతరం పోరాడారని తెలిపారు.

ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడంతో పాటు వారికి న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి అన్నారు. ఏ కులానికీ, ఏ ప్రాంత ప్రజలకూ వ్యతిరేకంగా ఆదివాసీలు లేరని, తమకు న్యాయంగా రావాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నారని స్పష్టం చేశారు.

అడవిపై హక్కులు, భూమిపై హక్కులు, విద్య, ఉపాధి, గృహాలు తదితర ప్రాథమిక అవసరాలు ఆదివాసీలకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఆదివాసీ ప్రాంతాల నుంచి తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను అధికారులు గౌరవంగా చూడాలని మంత్రి సూచించారు. పేదలు, చదువు లేని వారు తమ సమస్యలతో వచ్చినప్పుడు వారిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరి వినతిని ఓపికగా విని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు .

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు వివిధ శాఖల ద్వారా సుమారు రూ.1,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు చెప్పారు.

స్కిల్ డెవలప్‌మెంట్, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాల శాఖల ద్వారా నియోజకవర్గానికి అవసరమైన మరిన్ని అభివృద్ధి పనులను మంజూరు చేయించేందుకు తన వంతు సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

కొమరం భీమ్ “జల్, జంగల్, జమీన్” నినాదంతో పోరాటం చేశారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన అంశాలుగా నిలిచాయని తెలిపారు. కొమరం భీమ్ పోరాట స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో ఆదివాసీ బిడ్డలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఆదివాసీ యువత విద్యారంగంలో మరింత ముందుకు వెళ్లాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. యువత అభివృద్ధి చెందితేనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఆదివాసీల భాష, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, గోత్రాలు, జీవన విధానమే వారి అస్థిత్వమని మంత్రి సీతక్క అన్నారు. ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా తమ మూలాలను, మాతృభాషను, సంస్కృతిని, సంప్రదాయాలను మరచిపోకూడదని సూచించారు.

మన భాష, మన వేషం, మన సంస్కృతి, మన సంప్రదాయాలే మన గుర్తింపు. వాటిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలి అని మంత్రి పిలుపునిచ్చారు.

కొమరం భీమ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆదివాసీ సమాజ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి సీతక్క తెలిపారు.

ఆదివాసీ సమాజ విద్యాభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ఆదివాసీ సమాజంలో ఐక్యత, చైతన్యం, విద్యాభివృద్ధి పెంపొందించాలనే లక్ష్యంతో అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. కొమరం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆదివాసీ సమాజానికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమమన్నారు.

ఆదివాసీ యువత విద్యారంగంలో మరింత ముందుకు వెళ్లాలని, ఉన్నత విద్యను అభ్యసించి అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అశ్వారావుపేట నియోజకవర్గంలో కొమరం భీమ్ పేరుతో ఏర్పాటు చేయనున్న అర్బన్ పార్కును మరింత అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష ఉందన్నారు. ఆదివాసీల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం భావితరాలకు తెలిసేలా మ్యూజియం,గిరిజన విద్యా వికాశం భవనం ఏర్పాటు చేయడానికి అవసరమైన సహకారం అందించాలని మంత్రి సీతక్కను కోరారు.

ఆదివాసీ సంక్షేమం, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత : కలెక్టర్ అంకిత్

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ఆదివాసీ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. కొమరం భీమ్ వంటి మహనీయుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.

కొమరం భీమ్, రాంజీ గోండు, సమ్మక్క-సారలమ్మ వంటి ఆదివాసీ వీరుల పోరాట చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీల భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి తదితర రంగాల్లో అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు.

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో చైతన్యం, ఐక్యతను పెంపొందించడంతో పాటు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పిస్తాయని కలెక్టర్ అన్నారు .

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యా చందన, జెడ్పి సీఈవో నాగలక్ష్మి, మాజీ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు,ఆదివాసీ జేఏసీ నాయకులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, కొండరెడ్డి, నాయకపోడు తదితర గిరిజన వర్గాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!