బీఆర్‌ఎస్ పోరాటంతోనే కాంగ్రెస్ మేల్కొంది
కాంగ్రెస్ నాయకుల సవాళ్లు, ఫోటోలకు ఫోజులు హాస్యాస్పదం
అల్వాల వెంకటరెడ్డి, పెద్దమందడి బీఆర్‌ఎస్ నాయకులు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 10 2026: రైతులకు సాగునీరు అందించాలన్న బీఆర్‌ఎస్ పోరాటం, హెచ్చరికలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ప్రస్తుతం నీటిని విడుదల చేసిందని పెద్దమందడి బీఆర్‌ఎస్ నాయకుడు అల్వాల వెంకటరెడ్డి అన్నారు. రైతులకు సాగునీరు అందించడం మంచి పరిణామమేనని, దీనిని బీఆర్‌ఎస్ స్వాగతిస్తుందని స్పష్టం చేశారు.అయితే వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచిన తర్వాత, బీఆర్‌ఎస్ రైతుల పక్షాన నిలబడి ప్రశ్నించడంతో ఇప్పుడు సాగునీరు వదిలి.. తామేదో ఘనకార్యం చేసినట్లు కాంగ్రెస్ నాయకులు ఫోటోలతో ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు.సాగునీరు వదిలాం.. ఇదిగో ఫోటోలు చూడండి అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. నీళ్లు వదిలిన విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ నీరు బీఆర్‌ఎస్ పోరాటం చేసిన తర్వాతే ఎందుకు వచ్చింది? రైతుల సమస్యను ముందే పరిష్కరించాల్సిన బాధ్యత అధికార పార్టీది కాదా? అని అల్వాల వెంకటరెడ్డి ప్రశ్నించారు.బీఆర్‌ఎస్ రైతులను పక్కదారి పట్టిస్తోందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. రైతుల సమస్యపై బీఆర్‌ఎస్ మొదటి నుంచి స్పష్టమైన వైఖరితో ఉందని, ప్రభుత్వం నీరు అందిస్తే స్వాగతిస్తామని.. అందించకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని చెప్పిందే తమ పార్టీ వైఖరి అని తెలిపారు.రైతుకు సాగునీరు అందితే మాకు సంతోషమే. నీళ్లు ఎవరు ఇచ్చారన్నది కాదు.. రైతు పొలానికి నీరు చేరిందా లేదా అన్నదే ముఖ్యం. కాంగ్రెస్ నాయకులు ఫోటోలు పెట్టుకోవడం కాదు.. చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చూడాలి. బీఆర్‌ఎస్ రైతులను పక్కదారి పట్టించడం లేదు.. రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడుతోంది అని అల్వాల వెంకటరెడ్డి స్పష్టం చేశారు.రైతులకు సాగునీరు అందే విషయంలో ప్రభుత్వం ఇకపై నిర్లక్ష్యం చేయకుండా, చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ ఎప్పటికీ రైతుల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.

