పొలిటికల్ పవర్ ప్రతినిధి మల్కాజ్గిరి కమిషనరేట్ ఇంచార్జ్ ఏ. పాండు రంగా రావు
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా : కీసర మండలం : దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటనపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రస్థాయిలో స్పందించింది. విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందా? భద్రతా నిబంధనలు ఎందుకు పాటించలేదు? అనే అంశాలపై కమిషన్ సీరియస్‌గా ఆరా తీసింది.
ఈ ఘటనపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అలాగే జవహర్‌నగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సైదులుతో మాట్లాడి ఘటనకు సంబంధించిన పరిస్థితులు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సుమారు 600 మంది విద్యార్థులు చదువుతున్న శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల భద్రత కోసం తగిన సీసీ కెమెరాల వ్యవస్థ లేకపోవడంపై కమిషన్ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్న విద్యాసంస్థలో భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేసింది.
విద్యార్థులపై దాడులు, వేధింపులు లేదా ఇతర అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు వాస్తవ పరిస్థితులను గుర్తించేందుకు, బాధ్యులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు కీలకంగా ఉంటాయని పేర్కొంటూ, పాఠశాలలో భద్రతా ఏర్పాట్లపై సమగ్రంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.
ఈ నేపథ్యంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా డీఈవో తక్షణమే ఈ వ్యవహారంపై దృష్టి సారించి, దమ్మాయిగూడ శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, పాఠశాల యాజమాన్యం అనుసరిస్తున్న నిబంధనలు తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. విచారణలో పాఠశాల యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది. విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదనే స్పష్టమైన సందేశాన్ని ఈ ఘటన ద్వారా కమిషన్ ఇచ్చినట్లయింది.
*విద్యార్థిపై దాడి ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్* *శ్రీ చైతన్య పాఠశాల భద్రతా లోపాలపై ఆరా.. సీసీ కెమెరాలు లేకపోవడంపై ఆగ్రహం*
RELATED ARTICLES
