23కు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ చేసినట్లు డి.ఎస్.పి వెల్లడి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 27 2026: కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో వనపర్తి జిల్లా డీఎస్పీ బాలాజీ,సిఐ ఓడి రమేష్ ఎస్సై ఎం విక్రం,తో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి బాలాజీ మాట్లాడుతూ… ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కొత్తకోట పోలీసులు పట్టుకున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కొత్తకోట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కానాయపల్లి గ్రామ శివారులో ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి ప్రయత్నిస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ ఎం. విక్రం ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ముఠాను చుట్టుముట్టగా, ఐదు మంది నిందితులు వాహనాలను అక్కడే వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంబడించి ముగ్గురిని పట్టుకున్నారు. పలు జిల్లాల్లో 23కు పైగా చోరీలు పోలీసుల విచారణలో నిందితులు గత ఎనిమిది నెలలుగా వివిధ జిల్లాల్లో ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. వనపర్తి జిల్లాలో 9, మహబూబ్‌నగర్ జిల్లాలో 5, గద్వాల జిల్లాలో 4, నారాయణపేట జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2 కేసులకు సంబంధించి మొత్తం 23కు పైగా ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారని వీరి నుంచి 2 లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు డి.ఎస్.పి తెలిపారు.
చోరీకి పాల్పడుతున్న ముఠా
ముఠాలోని A-1 డాకూరి పెద్ద లింగన్న అలియాస్ డక్కలి లింగా, A-2 మహంకాళి కిషోర్ ముందుగా బైక్‌లపై వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న ప్రదేశాలను గుర్తించి రెక్కీ నిర్వహించేవారని అనంతరం రాత్రి సమయంలో బజాజ్ ట్రాలీ ఆటో, టాటా ఏస్ ట్రాలీ ఆటో, బైక్‌లపై మిగతా నిందితులతో కలిసి అక్కడికి చేరుకునేవారు.ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరా చేసే జంపర్ వైర్లను కట్ చేసిన అనంతరం, వెంట తెచ్చుకున్న పనిముట్లతో ట్రాన్స్‌ఫార్మర్‌ను తెరిచి అందులోని కాపర్ కాయిల్‌ను తొలగించేవారని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌లో సుమారు 40 నుంచి 45 కిలోల వరకు కాపర్ కాయిల్ ఉంటుందని నిందితులు తెలిపినట్లు పేర్కొన్నారు. కిలో రూ.200కు విక్రయం చోరీ చేసిన కాపర్ కాయిల్‌ను గుర్తుతెలియని వ్యాపారులకు కిలోకు సుమారు రూ.200 చొప్పున విక్రయించేవారని పోలీసులు తెలిపారు. వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని A-1, A-2 వద్ద ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని ముఠా సభ్యులు సమానంగా పంచుకునేవారని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడంలో చొరవ చూపిన ఎస్సై ఎం విక్రం, భాస్కర్, ను డిఎస్పీ అభినందించారు.

