టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఖమ్మం..
*సోషల్ మీడియాలో తల్వార్‌తో విన్యాసాలు.. కేసులు నమోదు*
*పుట్టినరోజు వేడుకల పేరుతో ఆయుధాల ప్రదర్శన చేస్తే కఠిన చర్యలు*
*ఖమ్మం టూ టౌన్ ఎస్సై రమేష్*
పొలిటికల్ పవర్ ఖమ్మం జిల్లా ప్రతినిధి
పుట్టినరోజు వేడుకల సందర్భంగా తల్వార్‌లు, కత్తులు వంటి ఆయుధాలతో విన్యాసాలు చేస్తూ వాటిని వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేస్తున్న ఘటన పై ముగ్గురిపై ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆదేశాల మేరకు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇటువంటి వీడియోలను పోలీసు సోషల్ మీడియా బృందం పరిశీలించి, ఘటనకు సంబంధించిన నగరానికి చెందిన షేక్ ఖాదర్, సయ్యద్ సమీర్, ఖమ్మం రూరల్ మండలం కు చెందిన షేక్ సమీర్ అనే ముగ్గురు వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాల ప్రదర్శన చేయడం, ప్రమాదకరంగా విన్యాసాలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం ఏమాత్రం సహించబోమని ఎస్సై హెచ్చరించారు.
పుట్టినరోజు వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై వేడుకలు నిర్వహించడం, ఆయుధాలతో విన్యాసాలు చేయడం, వాటిని వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా కూడా పోలీసుల దృష్టికి వచ్చిన ఘటనలపై విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

