పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 24 2026: హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చారిత్రక కట్టడం చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడటంతో పర్యాటకులు, స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చార్మినార్ మొదటి అంతస్తు ప్రాంతంలో మరమ్మతులకు సంబంధించిన అలంకరణ భాగాలు ఊడిపడి కింద పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి సమయంలో ఘటన చోటుచేసుకోవడంతో ఆ సమయంలో పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. చార్మినార్ వంటి చారిత్రక కట్టడంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై పురావస్తు శాఖ నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ మక్కా మసీదు వైపు పెచ్చులు ఊడిపడిన ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. మరోసారి భాగ్యలక్ష్మి ఆలయం వైపు కూడా కట్టడం నుంచి కొంత భాగం ఊడిపడినట్లు వారు పేర్కొంటున్నారు. తాజాగా మరోసారి పెచ్చులు ఊడిపడటంతో చార్మినార్ పరిరక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశ, విదేశాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శించే ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని పర్యాటకులు అంటున్నారు. భారీ వర్షాల సమయంలో కట్టడం బయటి పొరల్లోని ప్లాస్టర్ దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందస్తు తనిఖీలు, శాస్త్రీయ పరిరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. చార్మినార్ చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పురావస్తు శాఖ నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెచ్చులు ఊడిపడిన ప్రాంతాన్ని పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు. “చార్మినార్ భద్రతపై ఇకనైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి” అని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.

