లచ్చాపురం వాలీబాల్ టోర్నమెంట్‌లో విజేతలకు బహుమతుల ప్రదానం
పొలిటికల్ పవర్,దమ్మపేట, అక్టోబర్ 19: యువత క్రీడలతో పాటు విద్యలోనూ రాణించి, తమ ప్రతిభతో గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని బీఆర్‌ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు సోయం వీరభద్రం అన్నారు. దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.8,116 నగదు బహుమతిని సోయం వీరభద్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు రెండింటినీ సమానంగా స్వీకరించాలని సూచించారు. ఓటమి ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా, దానిని పాఠంగా తీసుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని అన్నారు.
క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమయం కేటాయిస్తూ తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని యువతకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీల నిర్వహణ యువతలో ప్రతిభను వెలికితీయడానికి దోహదపడుతుందని తెలిపారు.
కార్యక్రమానికి హాజరైన సోయం వీరభద్రంను టోర్నమెంట్ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను, పోటీలను విజయవంతంగా నిర్వహించిన అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులను పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, అంకథ ఉమామహేశ్వరరావు, కునుసోత్ రూప్‌సింగ్, తిరువీధుల జేమ్స్, యార్లగడ్డ శ్రీనివాసరావు, గద్దాల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.


