

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ (చిట్లూరి కిషోర్)
పాల్వంచ ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజా జీవితంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన వనమా వెంకటేశ్వరరావు సేవలు అభినందనీయమని ఆయన కొనియాడారు.
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వరరావుతో తనకున్న సుదీర్ఘ ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ, ప్రజాభిమానాన్ని చూరగొన్న నాయకుడిగా వనమా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం, వివిధ హోదాల్లో ప్రజలకు సేవలందించిన అనుభవం ఆయన రాజకీయ జీవితానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయని వద్దిరాజు రవిచంద్ర అన్నారు. వనమా వెంకటేశ్వరరావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులోనూ ప్రజల మధ్య ఉంటూ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు, అనుచరులు, నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.
వనమా జన్మదిన వేడుకలు అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరగాలని ఆయన ఆకాంక్షించారు.

