కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
అందుబాటులో డిడిఆర్ఎఫ్ బృందాలు: ఎస్సై సాయి కిషోర్ రెడ్డి
పొలిటికల్ పవర్, ఆర్సి ఇంచార్జ్ ఎం.నాగార్జున, అశ్వారావుపేట, అక్టోబర్ 4:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని అంకమ్మ తల్లి చెరువు నిండి అలుగు ఉధృతంగా ప్రవహించడంతో అశ్వారావుపేట–భద్రాచలం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చెరువు నుంచి వెలువడుతున్న వరద నీరు రహదారిపైకి చేరడంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది.
రహదారిపై వరద ప్రవాహం పెరగడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు, అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు, భారీ లారీలు, ప్రైవేట్ వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానిక అధికారులు వరద నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. డీడీఆర్ఎఫ్ (DDRF) బృందాలను అందుబాటులో ఉంచామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి, వరద ప్రవాహం తగ్గితే మరుసటి రోజు ఉదయం 10 గంటలలోపు రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వరద నీటి ప్రవాహం తగ్గే వరకు ఈ మార్గంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.


