
పొలిటికల్ పవర్, పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ రాజకీయంలో సరికొత్త పరిణామం చోటుచేసుకోబోతోంది! భార్య కోరిక మేరకు, తన మామ – దివంగత కేంద్ర మాజీ మంత్రి, మేధావి నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన పేరిట రాష్ట్రంలో ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) ని కేంద్రంగా చేసుకుని ఈ కొత్త జిల్లాకు రంగం సిద్ధమైంది.
ఐదు నియోజకవర్గాలు.. హయత్‌నగర్ చేరిక!
ఈ నయా జిల్లా ఏర్పాటుపై ఇప్పటికే రంగారెడ్డి, ఉమ్మడి జిల్లాల అధికారులు కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు పంపినట్లు విశ్వసనీయ సమాచారం.
* కలిసే నియోజకవర్గాలు: ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ సమీపంలోని హయత్‌నగర్ ప్రాంతం కూడా ఈ కొత్త జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి.
* రంగారెడ్డి కలెక్టర్ ప్రతిపాదనలు: మహేశ్వరం మండలాన్ని పూర్తిగా కొత్త జిల్లాలో విలీనం చేయడంతో పాటు, కందుకూరు మండలంలోని 9 కీలక గ్రామాలను కూడా ఈ జిల్లాలో కలపాలని కలెక్టర్ నుండి ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి.
రాజకీయం వర్సెస్ సెంటిమెంట్!
పాలనా సౌలభ్యంతో పాటు కుటుంబ సెంటిమెంట్, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీతో ఈ ప్రాంత రూపురేఖలే మారబోతుండగా.. ఇప్పుడు జైపాల్ రెడ్డి పేరిట జిల్లా రూపుదిద్దుకోనుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

