
– మిల్లర్ల అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి,
– వనపర్తి జిల్లా అదనపు కలెక్టరుకు రాచాల వినతి,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.07.2026.వనపర్తి జిల్లాలోని అన్ని రైస్ మిల్లులలో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించిన తరువాతే ఖరీఫ్ సీజన్ (2026-27) వరి ధాన్యం కేటాయించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈమేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొందరు మిల్లర్లు చేసే అక్రమాలకు సివిల్ సప్లయ్ అధికారులు సహకరిస్తుండటంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం రావటంతో పాటు తీవ్ర అప్రతిష్ట పాలు అవుతున్నదని,ఈ అక్రమాలకు సంబంధించి ఇటీవల అనేక సంఘటనలు వెలుగులోకి రావడం కూడా జరిగిందని అన్నారు.అంతే కాకుండా జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించి క్లీన్ చీట్ ఇచ్చిన వెంటనే విజిలెన్స్ అధికారులు మళ్లీ తనిఖీలు నిర్వహించగా వేలాది ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు ఇటీవల నిరూపితమైంది.ఖరీఫ్ సీజన్ (2026-27) ధాన్యం కేటాయింపులు చేసే ముందు మరోసారి అన్ని రైస్ మిల్లులలో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తే అర్హత కలిగిన రైస్ మిల్లర్లకు ధాన్యం వచ్చే అవకాశం ఉంటుందని,ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టకుండా, ప్రభుత్వం అప్రతిష్టపాలు కాకుండా, అర్హత కలిగిన మిల్లర్లకు న్యాయం జరగాలంటే అన్ని రైస్ మిల్లులలో మరోసారి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించడంతో పాటు మిల్లర్ల అక్రమాలకు సహకరించిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.అదనపు కలెక్టరును కలిసిన వారిలో బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ తదితరులు ఉన్నారు.


