ముద్దిరాజు కులాన్ని బీసీ-ఏలో చేర్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి
వనపర్తిలో బీసీ-ఏ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026: వనపర్తి: బీసీ-ఏ వర్గాల హక్కులు, రిజర్వేషన్ అవకాశాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ వనపర్తిలో బీసీ-ఏ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శనివారం అంబేద్కర్ చౌరస్తా నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ముద్దిరాజు కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏలో చేర్చే ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటికే బీసీ-ఏలో ఉన్న 57 కులాలకు ఈ నిర్ణయం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రజక, వాల్మీకి, వడ్డెర, నాయీ బ్రాహ్మణ, మేదర, బెస్త, గంగపుత్ర, గంగిరెద్దుల తదితర కులాలకు రిజర్వేషన్ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బీసీ-ఏలోని వెనుకబడిన కులాల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఆయా కులాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం తన ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ-ఏ కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.



