
పొలిటికల్ పవర్ ప్రతినిధి తెలంగాణ
మాజీ రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి పచ్చి అబద్ధాలు, కప్పదాటు వ్యవహారాలతో ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. తనను తాను శక్తిమంతుడిగా చెప్పుకునే సాయిరెడ్డి ఇప్పుడు తన రాజకీయ జీవితాన్ని అబద్ధాలు, అసత్యాలతో ముందుకు నడపడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
తానెందుకు పార్టీని వదిలేయాల్సి వచ్చిందో ప్రజలకు ఇచ్చిన వివరణలు చూస్తేనే ఆయన మాటల్లో నిజాయితీ, స్థిరత్వం మచ్చుకైనా కనిపించవు.
జగన్ తన కుమార్తెను కలుసుకోవడానికి లండన్ వెళ్లిన సందర్భంలో సాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారు. అప్పటికీ ఆయన రాజ్యసభ సభ్యుడే. ఆ క్షణం నుంచి ఇవ్వాళ్టి వరకూ సాయిరెడ్డి చెప్తున్న కారణాలు మారుతూనే వచ్చాయి.
ఎప్పుడెప్పుడు ఎలా మార్చాడన్నది మరో సందర్భంలో వివరిస్తాం.
వాస్తవంగా నమ్మకస్తుడినని తనకు తానుగా ప్రచారం చేసుకోవడం, ఆ మేరకు పార్టీలో ఒక వర్గాన్ని తయారు చేసి, వారిని గుప్పిట్లో పెట్టుకొని సాయిరెడ్డి నడిపిన రాజకీయం వైయస్సార్ సీపీని నట్టేట ముంచేసిందన్నది నిజం.
ఉత్తరాంధ్రకు అతడే సీఎంగా వ్యవహరిస్తూ వైజాగ్ సహా ఇతర ప్రాంతాల్లో నడిపిన దందాలు అందరికీ బహిరంగ రహస్యమే. ప్రభుత్వ కార్యాలయాల్లో తన వాళ్లంటూ ఒక వర్గాన్ని సృష్టించి.. సహజంగా జరిగే పనులన్నింటినీ కూడా ఆయా వర్గాల చేతుల్లో పెట్టుకున్నాడన్నది కూడా నిజం. ఎమ్మెల్యేలను స్కూలు పిల్లల్లా చూస్తూ సాయిరెడ్డి వ్యవహరించిన అహంకార, అధిపత్య ధోరణి ఉత్తరాంధ్రలో పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది.
ఇంత జరిగినా, తనకు సమాచారం ఉన్నా, పరిణితి చెందుతాడు, నమ్మకస్తుడని పార్టీ అధిష్టానం వదిలేయడం వైయస్సార్‌సీపీ కొంపముంచింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎన్నెన్నో..
పార్టీ నుంచి 2 సార్లు రాజ్యసభ, పార్టీ, ప్రభుత్వం నుంచి 19 పదవులు పొందిన సాయిరెడ్డి, తన వల్ల పార్టీకి జరిగిన నష్టం, వ్యతిరేకతలను తెలివిగా మరొకరి మీదకు నెట్టేశాడు.
మీడియాలో, సోషల్ మీడియాలో తన ప్రలోభాల వల్లో, బెదిరింపుల వల్లో ఒక వర్గాన్ని సృష్టించి, వారి ద్వారా ఆ నెపాన్ని వేరొకరి మీదకు నెట్టేశాడు. దగ్గరుండి ఈ పరిణామాలు చూసుకున్నవాళ్లు ఇప్పటికీ ఆ నెపాన్ని వారి మీదకు నెడుతూనే ఉన్నారు. అన్నీ పొంది ద్రోహం చేసిన సాయిరెడ్డి, ఇప్పుడు ఆ నెపాన్ని జగన్‌పైనా నెట్టడానికి కూడా వెనకాడ్డం లేదు.

