ఉపాధ్యాయుడి అధికారం కూలిన రోజే సమాజం తన భవిష్యత్తును చంపుకుంది.

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా నుంచి సేకరణ
ఒకప్పుడు ఉపాధ్యాయుడు దండిస్తే తల్లిదండ్రులు తలవంచేవారు.
ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు (అందరూ కాదండీ) పిల్లల ముందే ఉపాధ్యాయుడిని అవమానించే స్థాయికి దిగజారుతున్నారు.
ఇక్కడే అసలు పతనం మొదలైంది.
తప్పు చేసిన పిల్లాడిని కాదు,
తప్పు చూపించిన ఉపాధ్యాయుడినే నిందించడం మొదలైన రోజే
విద్యార్థి లోకపు నాశనం ప్రారంభమైంది.
“నీకు అధికారం ఎవరిచ్చారు?”
అని ఉపాధ్యాయుడిని ప్రశ్నిస్తే
ఆ పిల్లాడు నేర్చుకునేది చదువు కాదు
తప్పు చేసినా కాపాడేవాళ్లు ఉంటారు
నియమాలు తనకు వర్తించవు
పెద్దలను ఎదిరించొచ్చు
ఇవే ఈ తరపు విద్యార్థి నేర్చుకుంటున్న అసలు పాఠాలు.
క్రమశిక్షణ లేని పెంపకం
స్వేచ్ఛ కాదు… విషం.
శిక్షించే అధికారం లేని ఉపాధ్యాయుడు
విద్య ఇవ్వలేడు—మహా అయితే పాఠాలు చదివిస్తాడు.
మార్కులు రావొచ్చు కానీ మార్గం దొరకదు.
దాంతో
10 ఏళ్లకే అహంకారం
15 ఏళ్లకే నియంత్రణలేని ప్రవర్తన
20 ఏళ్లకే జీవితాన్ని తట్టుకోలేని అసహనం
ఇది విధి కాదు.
ఇది ప్రమాదం కాదు.
ఇది పెంపకంలో జరిగిన ఘోరమైన తప్పు.
ఉపాధ్యాయుడు భయపడితే
విద్యార్థి భయపడడు.
ఉపాధ్యాయుడి మాటకు విలువ లేకపోతే
నియమాలకు విలువ ఉండదు.
నియమాలు లేని సమాజంలో
స్వేచ్ఛ కాదు అరాచకమే రాజ్యమేలుతుంది
దీనికి బాధ్యత ఎవరిది?
పిల్లలది కాదు.
ఉపాధ్యాయులది కాదు.
పూర్తిగా తల్లిదండ్రులదే.
పిల్లల్ని ప్రేమించడం అంటే
ప్రతి తప్పునీ సమర్థించడం కాదు.
తప్పు చేసినప్పుడు
తప్పు అని చెప్పడమే నిజమైన ప్రేమ.
ఉపాధ్యాయుడిని అవమానిస్తే
మీ పిల్లల భవిష్యత్తును
మీ చేత్తో మీరే నాశనం చేసుకున్నట్టే.
చివరగా ఒకటే మాట
ఉపాధ్యాయుడు శత్రువు కాదు.
వారు శిక్షిస్తే అది ద్వేషం కాదు,
స్వార్థం లేని బాధ్యత.
ఈ రోజు మీరు పిల్లల తప్పుని సమర్థిస్తే రేపు అదే తప్పు సమాజం శిక్షగా తిరిగి ఇస్తుంది.
ఉపాధ్యాయుడికి అధికారం ఇవ్వండి
అదే సమాజానికి శ్రీరామరక్ష
పిల్లల పాలిట జగద్రక్ష
ఉపాధ్యాయుడిని దేవుడిలా పూజించాల్సిన అవసరం లేదు
కానీ సాటి మనిషిగా అయినా గౌరవించండి
చివరగా
ఉపాధ్యాయుడి అధికారం కూలిన రోజే
సమాజం తన భవిష్యత్తును తానే చంపుకుంది.
గౌరవం పోయిన చోట
విలువలు నిలవవు.
విలువలు లేని విద్య
సమాజాన్ని నిలబెట్టలేదు.
23 సంవత్సరాల అనుభవం కలిగిన ఒక ఉపాధ్యాయుడి ఆవేదన.
