ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeభక్తి - ఆధ్యాత్మికతబలభద్రపురంలో బోనాల సంబరం.. భక్తి పారవశ్యంలో తొలి మహోత్సవం

బలభద్రపురంలో బోనాల సంబరం.. భక్తి పారవశ్యంలో తొలి మహోత్సవం

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ న్యూస్ అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి, బిక్కవోలు, ఆగస్టు 3:
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో శ్రీ మాతృశ్రీ శ్రీ శ్రీ గడి బాపనమ్మ తల్లి అమ్మవారి తొలి బోనాల మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
గ్రామంలోని నంది రామాలయం వద్ద నుంచి ప్రారంభమైన శోభాయాత్రలో సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు తలపై రంగురంగుల బోనాలు ఎత్తుకుని, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణలు, జైజైధ్వానాలు, డప్పు వాయిద్యాలు, భజా భజంత్రీల మేళతాళాల మధ్య సాగిన ఊరేగింపు గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.
అనంతరం శోభాయాత్ర కొవ్వూరి రామారెడ్డి–సత్యవతి దంపతుల నివాసం వద్ద వెలసిన శ్రీ మాతృశ్రీ శ్రీ శ్రీ గడి బాపనమ్మ తల్లి అమ్మవారి ఆలయం చేరుకుంది. అక్కడ వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు బోనాలను సమర్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
అమ్మవారి సుందర అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న మహిళలు, రంగురంగుల బోనాలు ఎత్తుకున్న చిన్నారులు మహోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బలభద్రపురంలో తొలిసారిగా నిర్వహించిన బోనాల మహోత్సవాన్ని విజయవంతం చేసి అమ్మవారిపై తమ అచంచల భక్తిని చాటుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!