మత్తు ముఠాపై పోలీసుల దెబ్బ
ప్రెస్ మీట్‌లో బయటపడ్డ నిజాలు
300 కిలోల గంజాయి స్వాధీనం
అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ బట్టబయలు

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ మే 23)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భారీ గంజాయి రవాణా ముఠాను ఛేదించారు. జిల్లా పోలీసు అధికారి రోహిత్ రాజు ఆదేశాలు, పాల్వంచ డీఎస్పీ సతీప్ కుమార్ సూచనల మేరకు అశ్వారావుపేట పోలీసులు, ప్రత్యేక దళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.1.50 కోట్ల విలువైన 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీ సతీప్ కుమార్, సీఐ నాగరాజు రెడ్డి, ఎస్సై రాజు కేసు వివరాలను వెల్లడించారు. వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలను ఆపి పరిశీలించగా గంజాయి రవాణా వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తనిఖీల్లో మారుతి బాలెనో కారులో ఐదు ప్యాకెట్లు, టాటా లారీలో ప్రత్యేక రహస్య గదిలో 25 ప్యాకెట్లు గుర్తించినట్లు వెల్లడించారు. మొత్తం 30 ప్యాకెట్లలో 300 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన నాలుగు మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజస్థాన్‌కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని, కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
