కొత్తగూడెం: పొలిటికల్ పవర్ ప్రతినిధి
ప్రభుత్వ నిధులను కాపాడాల్సిన అధికారులే కంటికి కనపడకుండా నొక్కేస్తున్నారు! ముఖ్యా ప్రణాళిక కార్యాలయం (సీపీఓ)లో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే పేరిట భారీగా నిధులు పక్కదారి పట్టిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజాధనాన్ని కాజేస్తూ, తమ సొంత ఖాతాల్లోకి, బంధువుల అకౌంట్లలోకి లక్షలాది రూపాయలను అక్రమంగా మళ్లించిన తీరు అధికారుల నిర్లక్ష్యానికి, అపరిమిత అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా మారింది.
అక్రమాల పర్వం.. అడ్డగోలు మళ్లింపు!
సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆపరేటర్లను వినియోగించింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా నిధుల పంపిణీ జరిగింది:
* అసలు దందా: పని చేసిన మెజారిటీ సిబ్బందికి రూ. 15 వేల నుంచి రూ. 20 వేల లోపే ఖాతాల్లో జమ కాగా, కార్యాలయ ముఖ్య ఉద్యోగులు మరియు వారి బంధువుల ఖాతాల్లోకి మాత్రం రూ. లక్షల్లో నిధులు డిపాజిట్ అయ్యాయి.
* లక్షలు తన్నుకెళ్లిన డేటా ఎంట్రీ ఆపరేటర్లు: ఒక్కో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాతాలో రూ. లక్షకు పైగా, గతంలో పనిచేసిన ఒక సీనియర్ అసిస్టెంట్, అటెండర్ మరియు సిపీఓల ఖాతాల్లోకి సైతం భారీగా డబ్బులు జమైనట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
* బంధువుల పేరిట దారి మళ్లింపు: ఒక అధికారి సోదరుని కుమారుడి ఖాతాలో రూ. 3.9 లక్షలు, మరో అధికారి తల్లికి రూ. 1.6 లక్షలు, సోదరి ఖాతాలో రూ. 2.4 లక్షలు డిపాజిట్ అయినట్లు స్పష్టమవుతోంది.
ప్రశ్నిస్తే అధికారుల నీళ్లు నమలడం!
మొత్తం రూ. 1 కోటి 42 లక్షల వ్యయంతో 15 రోజుల్లో పూర్తయిన ఈ ప్రక్రియలో ఒక్కో అధికారికి కేవలం రూ. 5,205 కంటే ఎక్కువ రాకూడదు. కానీ కొందరి ఖాతాల్లో ఏకంగా రూ. 5 లక్షల వరకు జమకావడం గమనార్హం. ఈ ఘోర అక్రమాలపై ల్యాప్-టాప్స్, బంధువులతో పనులు చేయించామని, భోజనాల ఖర్చులని రకరకాల కథలు అల్లుతూ అధికారులు నీళ్లు నములుతుండడం విశేషం.
వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ, వివరాలు అడిగితే “గతంలో పనిచేసిన అధికారులకే తెలుసు” అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాధనం పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారుల మౌనం, నిర్లక్ష్యంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి!

