రేగా కాంతారావుపై అక్రమ కేసు కొట్టివేతను స్వాగతించిన మాజీ ఎమ్మెల్యే
రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడి
అశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆగస్టు 19:
భారత రాష్ట్ర సమితి సినియర్ నేత, పినపాక మాజీ ఎమ్మెల్యే, మాజీ బిఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావుపై నమోదైన తప్పుడు కేసును హైకోర్టు కొట్టివేయడంపై అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేని అవాస్తవ ఆరోపణలతో బనాయించిన కేసులను న్యాయస్థానం కొట్టివేయడం ద్వారా అన్యాయంపై అంతిమంగా న్యాయమే గెలిచింది అని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేగా కాంతారావు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను, ఎదుగుదలను చూసి ఓర్వలేకనే రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితంగా, తప్పుడు ఫిర్యాదులతో ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూశారని విమర్శించారు.ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేని కారణంగా హైకోర్టు ఆ కేసును కొట్టివేసి రేగా కాంతారావుకు పూర్తి క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఇప్పటికైనా ప్రత్యర్థులు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని మెచ్చా నాగేశ్వరరావు హితవు పలికారు.
