బిక్కవోలు: ఎస్పీ ఆదేశాల మేరకు తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడి
గ్రామంలో ఎస్ఐ రవిచంద్రకుమార్ ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది గ్రామంలో పర్యటిస్తూ గ్రామస్థులతో నేరుగా మమేకమయ్యారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు గ్రామంలో శాంతిభద్రతల పరిస్థితి, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై వివరాలు సేకరించారు.
గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే విషయాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ రవిచంద్రకుమార్ సూచించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, ఏటీఎం, బ్యాంకు ఖాతా, యూపీఐ తదితర వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు.
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, బాలల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనపై మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గ్రామంలో మాదకద్రవ్యాల వినియోగం లేదా అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
అలాగే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని తెలిపారు.
ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా గ్రామాల్లో నేరాల నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఐ రవిచంద్రకుమార్ తెలిపారు. ప్రజలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఐ రవిచంద్రకుమార్ తెలిపారు.
