పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 172026: మదనాపూర్ అజ్జకొల్లు గ్రామంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇద్దరు ఏఎన్‌ఎంలను, డాక్టర్ ఎంఎల్‌హెచ్‌పీని నియమించాలని బీసీ పొలిటికల్ జేఏసీ వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేందర్ నాయుడు కోరారు. సోమవారం మదనాపురం మండల ప్రజావాణిలో ఎంపీడీవోకు ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మహేందర్ నాయుడు మాట్లాడుతూ… జనాభా అధికంగా ఉన్న అజ్జకొల్లు గ్రామంలో ప్రస్తుతం ఒకే ఏఎన్‌ఎం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడంతో నిరుపేదలు సైతం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే 10 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరారు. అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో అవసరమైన మందులు సక్రమంగా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మండల వైద్యాధికారి భవాని సానుకూలంగా స్పందిస్తూ జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో బాలవర్ధన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
