పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 17 2026: హైదరాబాద్ రాష్ట్ర ప్రయోజనాల పట్ల ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఆగస్టు 5న తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా స్పష్టమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటం, ప్రభుత్వాన్ని నిలదీయడం వల్లే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సమావేశాలు వాయిదా పడ్డాయని పేర్కొన్నారు. కేవలం సమావేశాలను వాయిదా వేయడం సరిపోదని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏడు ప్రాజెక్టుల అంశాలను సమావేశాల ఎజెండా నుంచి పూర్తిగా తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్రంలోని 42 లక్షల 15 వేల మంది రైతులకు ఈ పథకం భరోసా కల్పించిందని తెలిపారు. అయితే ఆగస్టు 13 నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా తొలగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న బీమా పథకం కారణంగా సుమారు 13 లక్షల మంది రైతులు బీమా సౌకర్యానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని హరీశ్‌రావు అన్నారు. పాత రైతు బీమా పథకాన్నే యథాతథంగా కొనసాగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించిందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా గత ప్రభుత్వాలు అమలు చేసిన మంచి పథకాలను కొనసాగించాలన్న కనీస ఇంగితం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని హరీశ్‌రావు విమర్శించారు.
