
పొలిటికల్ పవర్, సెప్టెంబర్,19:పాల్వంచ: ఆదివాసుల హక్కులు, రక్షణ చట్టాలు, ప్రభుత్వ జీవోలను పరిరక్షించడంతో పాటు ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 5న కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ముట్టడి, మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను శుక్రవారం పాల్వంచ పట్టణంలో ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు సమర్థవంతంగా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం, అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం చేపడుతున్న అక్టోబర్ 5వ తేదీ మహాధర్నాకు ఆదివాసులు, ప్రజాసంఘాలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

