మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
హైదరాబాద్ : బేగంపేట్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద జవహర్ నగర్ డంపింగ్ యార్డు కాలుష్య నియంత్రణకు, డంపింగ్ యార్డు సమస్యల నుండి శాశ్వత పరిష్కారం కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.
ప్రొఫెసర్ మురళీ మనోహర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ఎన్విరాన్‌మెంటలిస్టులు దొంతి నరసింహ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎన్ఎఫ్సీ మాజీ డిజిఎం హనుమంత రెడ్డి, ఎస్‌బిహెచ్ ఫార్మర్ బోర్డ్ డైరెక్టర్ పంపాలా నరసింహ, ఎంఆర్పిఎస్ ప్రతినిధి తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎదులాబాద్ నుంచి గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మింగరాజు, రజక సంఘం అధ్యక్షుడు వెంకటేష్, యాంటీ డంప్ యార్డు జేఏసీ కన్వీనర్ డాక్టర్ శంకర్ నారాయణ, కో కన్వీనర్లు మారం సమ్మిరెడ్డి, ఏనుగు సంజీవరెడ్డి, దమ్మైగూడ నుంచి ఓరుగంటి కృష్ణ కిషోర్, ఎదులాబాద్ మాజీ సర్పంచ్, మూసి పరిరక్షణ సమితి అధ్యక్షుడు బట్టి శంకర్, రెయిన్ వాటర్ హార్వెస్ట్ ఎక్స్పెక్ట్ సుభాష్ రెడ్డి, ఈ డాంప్ యార్డుకి వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లాల తిరుమల్ రెడ్డి, పట్లోళ్ళ విక్రమ్ రెడ్డి, కోర్టులో వాదిస్తున్న అడ్వకేట్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
జవహర్ నగర్ డంప్ యార్డ్ తరలింపు కోసం రాజీలేని పోరాటం: మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్.
హైదరాబాద్‌కు 70 శాతం ఆదాయమిచ్చే ప్రాంత ప్రజలను కాలుష్య కోరల్లో బలిచేస్తారా?.
ఈ నెల 27 నుంచే బాధితుల పక్షాన పాదయాత్ర ప్రారంభం – రాజీపడే ప్రసక్తే లేదు.
రాంకీ సంస్థ గుత్తాధిపత్యం.. చెత్త సేకరణ కార్మికులపై బౌన్సర్లతో దాడులా?.
సమస్య పరిష్కారానికి కేంద్రం నుంచి రూ. 2000-3000 కోట్ల నిధులు తేవడానికి సిద్ధం.
రాజకీయ కక్షలు పక్కనపెట్టి ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి.
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా నరకయాతన అనుభవిస్తున్న లక్షలాది మంది ప్రజల సమస్యను పరిష్కరించే వరకు రాజీపడే ప్రసక్తే లేదని, రేపటి నుంచే బాధిత ప్రజలతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నామని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..
తెలంగాణ మొత్తం ఆదాయంలో 70 శాతం ఆదాయం వచ్చేది ఈ ప్రాంతం నుంచేనని నాకు తెలుసు. గట్లాంటి ఈ నగరంలో ఇయ్యాల లక్షల మంది ప్రజలు కాలుష్యంతో బతుకు ఈడుస్తా ఉన్నారు. దీనికి పరిష్కారం కావాలని చెప్పి నేను పార్లమెంట్లో మాట్లాడినా. పార్లమెంట్లో మాట్లాడడమే కాకుండా కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ దగ్గరికి కూడా పోయి చెప్పినా. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్న ఈ కాలంలో జవహర్ నగర్ కంపునకు శాశ్వత పరిష్కారం చూపాలంటే సమగ్రమైన ప్రణాళికలతో రండి అని చెప్పి, నన్ను ఢిల్లీలో ఎట్లా చేస్తున్నారో చూసి రమ్మన్నారు. ఢిల్లీకి పోయి కోట్ల కొద్దీ టన్నుల వేస్ట్‌ను వాళ్లు జీరో ఎట్లా చేస్తున్నారో చూసినం. కానీ వాళ్లు స్పష్టంగా ఒక మాట చెప్పిండ్రు.. చెత్తను జీరో చేస్తున్నాం కానీ, గత 10-20 ఏండ్ల నుంచి అక్కడ ఏ భూగర్భ జలాలైతే పాయిజన్ అయినాయో వాటిని పూర్తిగా శుద్ధి చేయాలంటే చాలా సమయం పడుతుందని చెప్పిండ్రు. ఇవాళ జవహర్ నగర్లో ఉన్న రెండు మూడు కోట్ల టన్నుల చెత్తను రాత్రికి రాత్రే తీసేసినా. వెంటనే లక్ష్మీ నారాయణ చెరువో, చీరాల చెరువో బాగుపడవు, దానికి టైం పడుతుంది. అందుకే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ.. “జవహర్ నగర్ డంప్ యార్డ్‌ను నడపడంలో గత ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ వాడలేకపోయింది. సరైన నియంత్రణ లేకుండా పోయి అంత నష్టం జరిగిపోయింది. ఇవాళ సైన్స్ ఎంతో ఎదిగింది. ఇప్పుడు పెట్టే డంప్ యార్డుల్లో ఒక్క కిలో చెత్త కూడా వేస్ట్ కాకుండా ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఆర్గానిక్ మాన్యువల్ తయారు చేసుకోవచ్చు. ఒకనాడు ఊళ్లల్లో పెంటబంద ఎంత విలువైనదో మనకు తెలుసు. ఇవాళ చికెన్ వేస్ట్‌లో కూడా ఒక్క గ్రాము వృథా కాకుండా ఆదాయం తెచ్చుకునే పద్ధతులు వచ్చినప్పుడు.. ఇంత పెద్ద మహానగరంలో చెత్తను ప్రాసెస్ చేయడం ఎందుకు చేతకావడం లేదు?” అని ప్రశ్నించారు.
చెత్త సేకరణలో జరుగుతున్న దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “మేము తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు అనేక రకాల జేఏసీలు ఉండేవి. అందులో చెత్త ఏరుకునే వాళ్ల జేఏసీ కూడా ఒకటి ఉండేది. వాళ్లు ఆనాడు వచ్చి.. ‘సార్ మేము చెత్తను తెచ్చుకొని సెగ్రిగేట్ చేసుకుని, పనికొచ్చే వస్తువులను అమ్ముకొని మా కుటుంబాలను పోషించుకుంటున్నాం’ అని చెప్పేవారు. కానీ ఇవాళ రాంకీ సంస్థ ఈ చెత్త విషయంలో గుత్తాధిపత్యం చలాయిస్తూ.. వాళ్లను రానివ్వకుండా వెళ్లగొడుతోంది. వేలాది మంది చదువుకున్న నిరుద్యోగులు బతుకుదెరువు లేక సొంతంగా ఆటోలు కొనుక్కుని, ఇండ్లల్లో నెలకు రూ.100, రూ.150 తీసుకుని చెత్తను కలెక్షన్ చేసుకొని సెగ్రిగేట్ చేస్తుంటే.. దాని మీద కూడా కన్ను పడ్డది. ఆటో కార్మికులపై బౌన్సర్లను పెట్టి కొట్టిస్తున్నారు అంటే చెత్త చుట్టూ ఎంత పెద్ద మాఫియా నడుస్తోందో అర్థమవుతోంది. ఇలాంటి నీచమైన సంపాదన బొందలగడ్డకు మోసుకుపోతారా?. దీనికి కాపలా కుక్కల్లాగా ఉంటారా?. ఆటో కార్మికులు నా దగ్గరకు వస్తే.. మీరు చివరి దాకా కొట్లాడుతామంటేనే వస్తా, మధ్యలో లొంగిపోతే నేను రానని చెప్పిన. ప్రజల పొట్టకొట్టే మాఫియా ఆటలు సాగనివ్వం” అని హెచ్చరించారు.
డంపింగ్ యార్డ్ వల్ల ఏర్పడే కాలుష్యాన్ని ప్రస్తావిస్తూ.. “ఇక్కడి నుంచి వెలువడే మిథేన్ గ్యాస్ దాదాపు 12 లక్షల కార్లు రోడ్లపైకి వస్తే ఎంత పొల్యూషన్, ఎంత వేడి బయటకు వస్తుందో అంత కాలుష్యంతో సమానమని లెక్కలు చెబుతున్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో స్థానిక ప్రజలు బతుకుతున్నారో ఆలోచించాలి. 14 ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, మా జీవితమే కొట్లాట అయిపోయింది.. ఇక్కడ రాజీపడే ప్రసక్తే లేదు. బాధితులుగా ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా వచ్చి ఈ పాదయాత్రను ఆశీర్వదిస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. గతంలో లారీల కింద పడి చనిపోయినప్పుడో, కంపు ఇళ్లల్లోకి వచ్చినప్పుడో 20, 30 మంది బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసేవాళ్లు. కానీ ఇప్పుడు లక్షలాది మంది ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాక్షేత్రంలోనే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం. సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి, అవసరమైతే రూ.2000 నుంచి రూ.3000 కోట్లు కేంద్ర నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా” అని ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు పలుకుతూ.. “రేవంత్ రెడ్డి.. మీరు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు చూసిన, చెప్పిన పనులను ఇప్పుడు ముఖ్యమంత్రిగా అమలు చేయండి. ఇక్కడ రాజకీయాలు చేయకండి. మొన్న జూన్‌లో కూడా నేను చెప్పిన.. కేసీఆర్ మీద కోపం ఉంటే ఉండని, కానీ కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయండి అని. కేసీఆర్‌ను బోనులో నిలబెట్టే క్రమంలో తెలంగాణ రైతాంగాన్ని బోనులో నిలబెట్టకండి అని చెప్పిన. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలలో గ్రౌటింగ్ అయిపోయింది కాబట్టి, కనీసం 2 నుంచి 4 టీఎంసీలు పెట్టి పంపులు మునిగేదాకా నీళ్లు ఎత్తిపోస్తే తాగునీటికి, విద్యుత్ కేంద్రాలకు, ఎండిపోతున్న పంటలకు ఆసరా అవుతుందని చెప్పిన. ఎన్డీఎస్ఏ వాళ్లు ఆపారంటే.. అక్కడికి కూడా నేనే పోయి, ఎండీతో మాట్లాడి ఒప్పించి వచ్చిన. ఆనాడు నా మాట విని అలర్ట్ అయ్యి ఉంటే కన్నెపల్లి దగ్గర 670 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు కాకపోయేది. మనకు కావాల్సింది కేవలం 150 టీఎంసీలు మాత్రమే. పాలకులకు ఉండాల్సింది వ్యక్తిగత కక్షలు కాదు.. ప్రజల పక్షాన నిలబడే దృక్పథం ఉండాలి. ఎంత పెద్ద పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఆ పదవి ద్వారా ప్రజలకు ఎంత న్యాయం చేశామన్నదే ముఖ్యం. చాలామంది పెద్ద పోస్టులు అనుభవించినా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. రేవంత్ రెడ్డి కూడా కాలగర్భంలో కలిసిపోతారా లేక ప్రజల గుండెల్లో నిలబడతారా అనేది తేల్చుకోవాలి” అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
చివరగా.. “ఇది వేల కోట్ల రూపాయలతో ముడిపడిన సమస్య కాదు. ప్రభుత్వమే వెంటనే శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఒక్క కిలో చెత్త కూడా వేస్ట్ కాకుండా, లీచేట్ వాటర్ నేలలోకి ఇంకకుండా, మిథేన్ గ్యాస్ బయటకు రాకుండా పకడ్బందీ టెక్నాలజీతో నగరం నుంచి 30-40 కిలోమీటర్ల దూరంలో క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రాసెస్ చేయాలి. జవహర్ నగర్‌కు ఒక్క కిలో చెత్త కూడా రాకుండా చేయడంతో పాటు, ఇప్పటికే పేరుకుపోయిన చెత్త కుప్పను పూర్తిగా తరలించాలి. ఈ నెల 27 నుంచే జవహర్ నగర్ బాధితుల పక్షాన పాదయాత్రను ప్రారంభిస్తున్నాం. ఈ ప్రజా ఉద్యమాన్ని అందరూ ఆశీర్వదించి విజయవంతం చేయాలని కోరుతున్నానని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.
ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తం రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపుపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్ఎఫ్సీ (NFC) రిటైర్డ్ అధికారి పురుషోత్తం రెడ్డి ప్రసంగం.
కాలుష్యం అనేది కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతమైన ప్రజా సమస్య అని, గాలి-నీరు కలుషితమైతే సమాజంలో ప్రతి ఒక్కరూ బాధితులు కావాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల కోసం ఎన్ని ఆస్తులు, ఫ్లాట్లు, ఫామ్‌హౌస్‌లు సమకూర్చుకున్నా. వారికి పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి, తాగేందుకు స్వచ్ఛమైన నీరు అందించలేకపోతే వాటన్నింటికీ విలువే ఉండదన్నారు.
చెత్త సమస్యకు మూలకారణం మన ఇళ్ల నుంచే మొదలవుతుందని, తడి చెత్త – పొడి చెత్త వేరుచేసే విధానాన్ని క్రమశిక్షణతో సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.
మొదట్లో కేవలం రెండు లక్షల జనాభాకు సరిపడేలా ఏర్పాటైన జవహర్ నగర్‌కు నేడు కోట్లాది మందికి సంబంధించిన చెత్త తరలిస్తుండటం వల్లే తీవ్ర సంక్షోభం తలెత్తిందన్నారు.
అక్కడ పేరుకుపోయిన పాత చెత్త వల్ల ప్రమాదకరమైన లీచేట్ ద్రవం, మీథేన్ వాయువులు విడుదలై పరిసరాలను నాశనం చేస్తున్నాయని తెలిపారు.
గతంలో ఐఐటీ బాంబే నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
కేవలం విచారణలు, ప్రకటనలతో కాలయాపన చేయకుండా సమస్యను శాస్త్రీయంగా విభజించాలని, హైదరాబాద్ నగరంలోని మొత్తం చెత్తను ఒకే చోట కేంద్రీకరించకుండా నగరాన్ని నాలుగు దిక్కులుగా (ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర) విభజించి వేర్వేరు ప్రాంతాల్లో ఆధునిక శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అప్పుడే జవహర్ నగర్‌పై భారం తగ్గి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ (GHMC) మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి గారి ప్రసంగం:
ఈ సమస్యపై పోరాడుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారికి జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ…
ఆహారంతో పాటు పీల్చే గాలి కూడా తీవ్రంగా కలుషితమై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తరుణంలో ఈ అంశంపై పోరాటం చేయడం అత్యంత కీలకమన్నారు.
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నేపథ్యాన్ని వివరిస్తూ… సుమారు 2000 సంవత్సరంలో అల్వాల్, కాప్రా మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం కాకముందు, తక్కువ జనాభా అవసరాల కోసం ఈ డంపింగ్ యార్డును ప్రారంభించారని గుర్తుచేశారు.
ఆ తర్వాత ప్రత్యామ్నాయ డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయడంలో పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో, జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల చెత్త మొత్తాన్ని ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి నేరుగా జవహర్ నగర్‌కే తరలించడం మొదలుపెట్టారని చెప్పారు. మరోవైపు పేద ప్రజల కోసం అక్కడే సుమారు 6,000 ఇళ్లను నిర్మించి వారిని నేరుగా కాలుష్య కోరల్లోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 2009 నాటి నుంచే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు, గాలి, నేల తీవ్రంగా కలుషితమై ప్రజలు నివసించలేని నరకప్రాయ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి జవహర్ నగర్ ప్రజలను ఈ విష కాలుష్యం నుంచి విముక్తి చేసేందుకు డంపింగ్ యార్డును అక్కడి నుంచి తరలించి, పటిష్టమైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ :
సమస్యల మీద పోరాడే యోధుడు ఈటల రాజేందర్.
కోటి మంది చెత్త జవహర్ నగర్ ప్రజలు భరిస్తున్నారు.
సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న మేము ఎన్విరాన్మెంటల్ జస్టిస్ గురించి మాట్లాడాల్సిన పరిస్తితి వచ్చింది.
అణగారిన వర్గాల ప్రజలున్నారు ఏమీ చేయలేరు అనుకుంటున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి.
హైదరాబాద్ గ్లోబల్ నగర్ చేద్దాం అనుకున్న వారు, ఈ చెత్త నిర్వహణ చేయలేక పోతే ఎలా ?.
జర్మనీ, సౌత్ కొరియాలో ప్రత్యేక టెక్నాలజీలు ఉన్నాయి.
వేస్ట్ టు వెల్త్ చేయాలి.
రీజనల్ రింగ్ రోడ్డుకు అవతల చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
ఇది సొల్యూషన్ ఉన్న సమస్య.. కానీ ఉద్యమం చేస్తే తప్ప మనదగ్గర పాలకులు స్పందించరు.
ఈటల రాజేందర్ గారి ఉద్యమానికి మనమందరం మద్దతు పలుకుదాం.
పర్యావరణ వేత్త దొంతి నరసింహ రెడ్డి మాట్లాడుతూ:
మునిసిపల్ చెత్త నిర్వహణ పరమ చెత్తగా ఉంది.
మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో ఇంకా దారుణంగా ఉంది.
చెత్త వేరు చేయకపోవడం అత్యంత ప్రమాదకరం.
చెత్త వేరే దగ్గర వేయడంతోనే ఈ సమస్య పరిష్కారం కాదు.
చెత్త నిర్వహణ సరిగా చేయాలి.
జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ :
వ్యాపారాలు కాపాడుకోవడం కోసం, పదవుల కోసం రాజకీయాలు చేసే వాళ్లే ఎక్కువ ఉన్నారు.. కానీ ప్రజల కోసం కోట్లాడే నాయకుడు ఈటల రాజేందర్.
ఇన్నాళ్ళకు జవహర్ నగర్ డంప్ యార్డు వ్యతిరేక ఉద్యమానికి ఒక సరైన నాయకుడు దొరికాడు.
ఈటల రాజేందర్ గారి పాదయాత్రకు తెలంగాణ పౌర సమాజం, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.
ఈటల రాజేందర్ అన్న ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో ఆసుపత్రులకు తిరిగి తెలంగాణ సమాజాన్ని కాపాడారు.
ప్రాణాలు పోతున్న మల్కాజిగిరి ప్రజలను కాపాడడానికి ఇప్పుడు ముందుకు వచ్చారు.
ఆయన తలుచుకున్నారు అంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాడుతారు.. ఆ ప్రాంత ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చి పాదయాత్రలో పాల్గొనాలని కోరుతున్నాను.
అనేక దేశాల్లో జీరో పొల్యూషన్ తో చెత్తను రీసైకిల్ చేస్తున్నారు. మనం ఎందుకు చేయలేము.
ప్రపంచంలో అనేక దేశాల్లో రిజెక్ట్ చేసిన ఫార్మా కంపెనీలు అన్నీ హైదరాబాద్ కు వస్తె వాటికి మన ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. జనాలు చచ్చిన పర్లేదా ?
పదవుల కోసం పాదయాత్ర చేసిన వారిని చూసాం కానీ ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్న వ్యక్తి ఈటల రాజేందర్.
తిప్పారపు లక్ష్మణ్ మాట్లాడుతూ :
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ సమావేశానికి హాజరైన వారి ప్రతినిధులు తిప్పరపు లక్ష్మణ్.. 27 నుండి జరగబోయే ఈటల రాజేందర్ పాదయాత్రకు MRPS పూర్తి మద్దతు ప్రకటించారు.
ఒకప్పుడు మా జాతిని అంటరాని వారుగా చూసేవారు. ఇప్పుడు మా జాతి ఎక్కువగా ఉన్న జవహర్ నగర్ ను కూడా అంటారని ప్రాంతంగా చూస్తున్నారు.
అందుకే చెత్త తీసుకువచ్చి ఈ ప్రాంతంలో వేస్తున్నారు. బంజారాహిల్స్ లోనో, జూబ్లీహల్స్ చెత్త మా మీద ఎందుకు వేయాలి.
శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ, పౌరుల్లో చైతన్యం అవసరం: ప్రొఫెసర్ కృష్ణారెడ్డి (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ):
రౌండ్ టేబుల్ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ..
జవహర్ నగర్ పరిసరాల్లో పోగవుతున్న చెత్త గుట్టల కారణంగా విడుదలవుతున్న ప్రమాదకర వాయువులు, మీథేన్ తదితర గ్యాస్‌ల తీవ్రతతో సమీప ప్రాంతాల్లో విపరీతమైన వాయు, భూగర్భ జల కాలుష్యం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
దీనివల్ల లక్షలాది మంది ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో నరకయాతన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కాలుష్య కోరల నుంచి ప్రజలను రక్షించాలంటే జవహర్ నగర్ డంప్ యార్డును తక్షణమే శాస్త్రీయంగా ఇక్కడి నుంచి తరలించాల్సిన (షిఫ్ట్ చేయాల్సిన) ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
కేవలం యార్డును తరలించడమే కాకుండా, ప్రజల్లో ‘సివిక్ సెన్స్’ (పౌర స్పృహ), చెత్త వర్గీకరణపై సరైన చైతన్యం కల్పించినప్పుడే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఈ ప్రజా సమస్యపై చొరవ తీసుకుని అందరినీ ఏకం చేసిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారికి, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి, ఇతర ముఖ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

