బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు
ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ బంజారా
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16 2026: తెలంగాణలో ఎస్టీ, ముఖ్యంగా బంజారా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ బంజారా డిమాండ్ చేశారు. బంజారా యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించాల్సిన ఎస్టీ కార్పొరేషన్ పరిస్థితి ఏమిటని, అది ఎందుకు నిలిచిపోయిందని ఆయన ప్రశ్నించారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా అందాల్సిన రుణాలు, సబ్సిడీలు, స్వయం ఉపాధి అవకాశాలు ఎందుకు అందడం లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. “ఎస్టీ కార్పొరేషన్ మా హక్కు. అది ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విషయం కాదు. బంజారా యువత వ్యాపారాలు చేసుకోవాలి, స్వయం ఉపాధి పొందాలి, ఆర్థికంగా ఎదగాలి. అందుకోసం ప్రభుత్వం బలమైన ఆర్థిక సంస్థగా కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలి. కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి బంజారా యువతను నిరాశకు గురిచేయడం సరికాదు” అని కిషన్ బంజారా అన్నారు.
బంజారా సమాజానికి మంత్రి పదవి ఎందుకు లేదు?
తెలంగాణ రాజకీయాల్లో బంజారా సమాజానికి ఉన్న జనాభా, సామాజిక ప్రాధాన్యతకు అనుగుణంగా మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం ఎందుకు కల్పించడం లేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కిషన్ బంజారా డిమాండ్ చేశారు. “బంజారాలు కేవలం ఎన్నికల సమయంలో గుర్తుకొచ్చే ఓటర్లు కాదు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములైన సమాజం. మా సమస్యలను మంత్రివర్గంలో బలంగా వినిపించే స్థాయిలో బంజారా సమాజానికి రాజకీయ ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. గిరిజన సంక్షేమానికి సంబంధించిన శాఖ ఉండటం మాత్రమే సరిపోదని, బంజారా సమాజానికి రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అన్నారు.
బంజారా సేవా సంఘం ప్రధాన డిమాండ్లు
ఎస్టీ కార్పొరేషన్‌ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి. ఎస్టీ యువతకు సబ్సిడీ రుణాలు, స్వయం ఉపాధి పథకాలను వెంటనే అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న ఎస్టీ కార్పొరేషన్ దరఖాస్తులను పరిష్కరించాలి. బంజారా సమాజానికి మంత్రివర్గంలో తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. బంజారా యువత, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి. బంజారా సమాజానికి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక సమీక్ష నిర్వహించాలి.
“హక్కుల విషయంలో రాజీ ఉండదు”
“మాకు ఎవరి మీద వ్యక్తిగత వ్యతిరేకత లేదు. ప్రభుత్వం మంచి పని చేస్తే అభినందిస్తాం.. తప్పు జరిగితే ప్రశ్నిస్తాం. బంజారా సమాజ హక్కుల విషయంలో మాత్రం రాజీ ఉండదు. ఎస్టీ కార్పొరేషన్ కోసం, బంజారా సమాజానికి రాజకీయ ప్రాతినిధ్యం కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని కిషన్ బంజారా స్పష్టం చేశారు.
“పదవి కోసం కాదు.. బంజారా సమాజం గొంతుక కోసం!”
“బంజారా సమాజానికి మంత్రి పదవి ఇవ్వడం దయ కాదు.. మా రాజకీయ ప్రాతినిధ్యానికి గౌరవం. ఎస్టీ కార్పొరేషన్‌ను బలోపేతం చేయడం ఉపకారం కాదు.. మా యువత భవిష్యత్తుకు అవసరం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి.”


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16 2026: