– జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎం 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 28.2026.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదుదారునికి సమాచారమివ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి అట్టి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి నుంచి వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను సైతం సత్వరమే పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 45 దరఖాస్తులు వచ్చాయి.ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 2 దరఖాస్తులు వచ్చాయి.నేటి ప్రజావాణిలో జెడ్పి సీఈవో యాదయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్. తిరుపతయ్య, శిక్షణ ఉప కలెక్టర్లు మేడం శ్రావ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

