ePaper
Friday, September 11, 2026
📄 ePaper
Homeతెలంగాణఅశ్వారావుపేటతిరుమలకుంట ముద్దుబిడ్డ కు ఉస్మానియా వేదికపై డాక్టరేట్ కిరీటం

తిరుమలకుంట ముద్దుబిడ్డ కు ఉస్మానియా వేదికపై డాక్టరేట్ కిరీటం

📰 Generate e-Paper Clip

కష్టపడి చదివి.. పిహెచ్‌డి సాధించి: తిరుమలకుంట గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన డాక్టర్ కొనకళ్ల వరలక్ష్మి

చిన్నతనం నుంచే చదువుపై మక్కువ.. పిల్లలకు ట్యూషన్లు చెప్తూ ఉన్నత స్థాయికి!

తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహం, వరుస ప్రభుత్వ ఉద్యోగాల విజయాలతో ఉస్మానియాలో డాక్టరేట్ ప్రదానంపొలిటికల్ పవర్,అశ్వారావుపేట,సెప్టెంబర్ 09: స్వయంకృషి, పట్టుదల, కుటుంబ ప్రోత్సాహం తోడైతే సాధించలేనిదేదీ లేదని నిరూపించారు అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన కొనకళ్ల బాబురావు, నాగమణి దంపతుల కుమార్తె కొనకళ్ల వరలక్ష్మి. చిన్నప్పటి నుంచి చదువుపై ఉన్న మక్కువతో ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ, శ్రమించి ఈనాడు ‘డాక్టరేట్’ సాధించి తమ గ్రామానికి, అశ్వారావుపేట మండలానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు.

కష్టాల ఎదురీత.. భర్త తోడ్పాటుతో

చిన్నతనం నుంచే పుస్తకాలతో నేస్తం చేసిన వరలక్ష్మి, తన చదువు కొనసాగిస్తూనే కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు తోటి పిల్లలకు ట్యూషన్లు చెప్పేవారు. వివాహం తర్వాత కూడా చదువుపై ఉన్న ఆసక్తిని గుర్తించిన ఆమె భర్త శ్రీనివాస్ అందించిన ప్రోత్సాహం, అండదండలతో ఆమె తన ఆశయ సాధన దిశగా అడుగులు వేశారు. ఒకవైపు గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు రాత్రింబవళ్ళు కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించారు.ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో ప్రొఫెసర్ ఉపేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో “ఎ స్టడీ ఆన్ ఫిక్స్డ్ పాయింట్ రిజల్ట్స్ ఇన్ వేరియస్ మెట్రిక్ స్పేసెస్” అనే అంశంపై చేసిన పరిశోధనకు గానూ విశ్వవిద్యాలయం ఆమెకు PhD పట్టాను ప్రదానం చేసింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జి. శివ ప్రతాప్ శుక్లా, భారత్ బయోటెక్ ఫౌండర్ & చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎమ్. ఎల్లా, మరియు ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారంల చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక పట్టాను అందుకున్నారు.వరుస ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు గణిత అధ్యాపకురాలిగా

వరలక్ష్మి విద్యాభ్యాసం తిరుమలకుంట ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు, వైరాలోని AP రెసిడెన్షియల్ స్కూల్‌లో 8 నుంచి 10వ తరగతి వరకు సాగింది. అశ్వారావుపేటలోని వికెడివి (VKDV) కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన ఆమెకు అక్కడ ఉచిత విద్య లభించింది. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎడ్, పిజి పూర్తి చేశారు.సొంత ప్రతిభతో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో వరలక్ష్మి సత్తా చాటారు. మొదట TGT (టీచర్) ఉద్యోగం సాధించగా, ఆ తర్వాత జూనియర్ లెక్చరర్ (JL) నోటిఫికేషన్‌లో మొదటి ర్యాంకర్లలో ఒకరిగా నిలిచారు. ఆపై నేరుగా డిగ్రీ లెక్చరర్ (DL) ఉద్యోగానికి ఎంపికై, ప్రస్తుతం వర్గల్‌లోని MJPTBCWRDC మహిళా డిగ్రీ కళాశాలలో గణిత (Maths) అధ్యాపకురాలిగా సేవలందిస్తున్నారు.కేవలం చదువును నమ్ముకుని, తల్లిదండ్రులు ప్రోత్సాహంతో, భర్త శ్రీనివాస్ సహకారంతో ఈ ఉన్నత స్థాయికి ఎదిగిన డాక్టర్ కొనకళ్ల వరలక్ష్మి నేటి యువతకు, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థినులకు నిలువెత్తు స్ఫూర్తిగా మారారు. ఈ పిహెచ్‌డి సాధనలో తనకు నిరంతరం సపోర్ట్‌గా నిలిచిన కుటుంబ సభ్యులకు మరియు ప్రతి ఒక్కరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె సాధించిన ఈ విజయం పట్ల తిరుమలకుంట గ్రామస్థులు, అశ్వారావుపేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!