ePaper
Friday, November 6, 2026
📄 ePaper

తుఫాన్ నష్టంపై రైతుల పక్షాన మెచ్చా గళం.. రూ.3.5 కోట్ల రింగుబండ్ నిర్మాణంపై విచారణ జరపాలి

📰 Generate e-Paper Clip

నష్టపోయిన ప్రతి రైతుకూ తక్షణ పరిహారం చెల్లించాలి.. దెబ్బతిన్న రహదారులు, చెరువులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే  

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున: మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. దెబ్బతిన్న పంట పొలాలు, గండ్లు పడిన చెరువులు, కొట్టుకుపోయిన రహదారులను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

 

 

తుఫాన్‌ కారణంగా పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మెచ్చా ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తు రైతుల ఆశలను ఆవిరి చేసిందన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి ఎలాంటి జాప్యం లేకుండా పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అచ్యుతాపురం చిన్నయ్యకట్టు చెరువుకు గండి పడటంతో రహదారి పూర్తిగా కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, తక్షణమే మరమ్మతులు చేపట్టి రహదారిని పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాతనారంవారిగూడెం నుంచి గుర్రాల చెరువుకు వెళ్లే మార్గంతో పాటు మొద్దులగూడెం రహదారి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కోరారు.

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని దొంతికుంట చెరువు వద్ద గండి పడటంతో నష్టపోయిన రైతులను పరామర్శించి, పంట నష్టం, ఆర్థిక ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నారాయణపురంలోనూ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టు వద్ద రూ.3.5 కోట్ల వ్యయంతో నిర్మించిన రింగుబండ్‌కు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన మెచ్చా నాగేశ్వరరావు నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రింగుబండ్‌ ఒక్క తుఫాన్‌కే దెబ్బతినడం బాధాకరమన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించారా? పనులను అధికారులు సక్రమంగా పర్యవేక్షించారా? అని ప్రశ్నించారు. కేవలం కమిషన్ల కోసమే ఈ నిర్మాణం చేపట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. ప్రజాధనం వృథా కాకుండా పనుల నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. రింగుబండ్‌ నిర్మాణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతుల పంటలు, ప్రభుత్వ నిధులను కాపాడాల్సిన బాధ్యత పాలకులు, అధికారులపై ఉందన్నారు. విపత్తులు వచ్చిన తర్వాత హడావుడిగా పర్యటించడం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, రహదారులు, చెరువులకు శాశ్వత మరమ్మతులు చేయాలని, నష్టపోయిన రైతులందరికీ న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

ఈ పర్యటనలో మాజీ జెడ్పీటీసీ జూపల్లి రమణారావు, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, మోహన్‌రెడ్డి, యుఎస్‌ ప్రకాశ్‌రావు, స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest Articles

లక్షల కోట్ల వారసురాలు… అయినా ఆమె… ఆ అనంత పద్మనాభుడికి సామాన్యుల్లోనే అతి సామాన్య దాసురాలు!!*

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

మురసు తుపాను దెబ్బకు అతలాకుతలం.. నష్టాన్ని పరిశీలించిన మంత్రి

దెబ్బతిన్న చెరువులు, నీటమునిగిన పంట పొలాల పరిశీలన.. ప్రాణనష్టం జరగకుండా అధికారుల సమష్టి కృషిపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి రిపోర్టర్ ఎం నాగార్జున,నవంబర్ 5: మురసు తుపాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...

మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ రఘురామ్ రెడ్డి ఎమ్మెల్యే జారె విస్తృత పర్యటన

 వరదలతో దెబ్బతిన్న ఇళ్లు పంట పొలాలు రహదారులు చెరువుల పరిశీలన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున:మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట...

error: Content is protected !!