దమ్మపేట మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. దెబ్బతిన్న రహదారులు, పంట పొలాల పరిశీలన.. తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున, దమ్మపేట: మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు. దమ్మపేట మండలంలోని దమ్మపేట, నెమలిపేట, పార్కలగండి, కొత్తూరు, పట్వారిగూడెం, దిబ్బగూడెం, జగ్గారం, అంకంపాలెం గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న రహదారులు, చెరువులు, వాగులతో పాటు వరద నీటిలో మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత ప్రజలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
తుఫాన్ కారణంగా రహదారులు దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న గ్రామాల్లో వెంటనే ప్రత్యామ్నాయ (డైవర్షన్) రహదారులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ఇతర ఆస్తి నష్టాలను సమగ్రంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. నష్టపోయిన బాధితులకు తగిన పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రధానంగా దమ్మపేట శివారులోని నెమలిపేట గ్రామం ప్రతి వర్షాకాలంలో వరద ముంపునకు గురవుతున్న విషయాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. గ్రామానికి వరద నీరు చేరకుండా రెండు వైపులా ఉన్న కాలువలకు కాంక్రీట్ గోడలు నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అనంతరం గ్రామంలోని డ్రైనేజీ సమస్యపై ప్రజలతో చర్చించారు. సీసీ రోడ్లకు దగ్గరగా ఇళ్ల గోడలు నిర్మించడంతో డ్రైనేజీ కాలువల ఏర్పాటుకు స్థలం సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గ్రామస్తులంతా పరస్పరం చర్చించుకుని డ్రైనేజీ నిర్మాణానికి సహకరించాలని కోరారు. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే రహదారులపై ప్రవహించే వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా కాలువల ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రజల సహకారంతోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, తుఫాన్ కారణంగా ప్రజలకు ఎదురైన ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరితగతిన పునరుద్ధరించాలని సూచించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి బాధితుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ పర్యటనలో మండల అధికారులు, మండల అధ్యక్షులు కక్కిరాల రమేష్, చిన్నశెట్టి యుగంధర్, వాసం శ్రీనివాసరావు, దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీల, మాజీ సర్పంచ్ కోర్సా సాగర్, పట్వారిగూడెం సర్పంచ్ కూరం అర్జున్‌రావు, ఉపసర్పంచ్ బొల్లికొండ నాగేశ్వరరావు, బాలరాజుగూడెం మాజీ సర్పంచ్ కుర్సం శ్రీనివాసరావు, జగ్గారం సర్పంచ్, దమ్మపేట మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వంక జానకిరామ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


