గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరు రైతాంగానికి సాగునీటి అన్యాయం
విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 03 2026: పాలమూరు సాగునీటి ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టి, అందిన కాడికి కమిషన్లు దండుకొని రైతాంగానికి తీరని అన్యాయం చేసిన గత పాలకులు.. ఇప్పుడు అదే ప్రాజెక్టుల పేరుతో రాజకీయ విమర్శలకు దిగడం దొంగే దొంగ దొంగ అన్నంత విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తొమ్మిదేళ్ల అధికారంలో ఉండి అందిన కాడికి దోచుకుని తిన్న నాయకులు నేడు నీతులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే మేఘారెడ్డి గత ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, జూరాల తదితర ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని వివరించారు. ప్రాజెక్టుల పనులు పూర్తికాకపోవడానికి గత పాలకుల వైఫల్యమే కారణమని విమర్శించారు. జూరాల నీటి నిల్వ సామర్థ్యం, రామన్‌పాడు సమాంతర కాలువ నిర్మాణంలోని సాంకేతిక లోపాలు, గూడెం దొడ్డి రిజర్వాయర్ నిర్మాణం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. అధికారంలో ఉన్నప్పుడే సమస్యలను పరిష్కరించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందన్న హరీష్‌రావు వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ.. ప్రాజెక్టు అంచనా వ్యయం, ఇప్పటివరకు జరిగిన ఖర్చు, మిగిలిన పనులపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి సరఫరాకు చర్యలు చేపడుతోందని తెలిపారు. కృష్ణా జలాల వినియోగం, ఆంధ్రప్రదేశ్‌కు నీటి తరలింపు అంశాలపై గత ప్రభుత్వ వైఖరిని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే పాలమూరు రైతాంగానికి సాగునీటి విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
బీఆర్‌ఎస్ నేతలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
-ఎమ్మెల్యే మేఘారెడ్డి
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ… తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో 365 కరువు మండలాలను ప్రకటించిన కొద్ది రోజులకే రైతుల సమస్యలపై రాజకీయ విమర్శలకు దిగడం వారి వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు? ఎన్ని పూర్తి చేశారు? పాలమూరు రైతాంగానికి ఎంత మేర సాగునీరు అందించారు? అన్న ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక లెక్కలు, వాస్తవ పరిస్థితుల ఆధారంగా ప్రజలకు వివరాలు వెల్లడిస్తోందని స్పష్టం చేశారు. కరువు పరిస్థితులపై ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమీక్షలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రైతులకు సత్వర ఉపశమనం కల్పించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించిందని, వారిని ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.
నీళ్ల దొంగ నిరంజన్
వనపర్తి లో ఉన్నావో మాజీ మంత్రి నీళ్ల నిరంజన్ కాదని.. నీళ్ల దొంగ నిరంజన్‌రెడ్డి’ అంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరంజన్‌రెడ్డికి సంబంధించిన ఫామ్‌హౌస్‌లలో అక్రమంగా బోర్లు తవ్వించి, రైతులకు అందాల్సిన సాగునీటిని తన ఫామ్‌హౌస్‌ల వైపు మళ్లించుకున్నారన్నారు. గతంలో ‘వరి వేస్తే ఉరే’ అంటూ రైతులను భయపెట్టిన నాయకులు, నేడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఉద్యోగాల కోసం పోరాడిన నిరుద్యోగులకు అమాలి పని చేసుకోవాలని సూచించిన నాయకులు ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన మాట్లాడటం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని విమర్శించారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బీఫామ్ కూడా దక్కదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత పాలకులు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు రైతుల కష్టాలను రాజకీయ అస్త్రాలుగా మార్చుకోవద్దన్నారు. రైతాంగానికి జరిగిన అన్యాయంపై చర్చకు సిద్ధమని, గత తొమ్మిదేళ్ల పాలనలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిపై బహిరంగంగా చర్చించాలని సవాల్ విసిరారు. అల్వాల వేదికగా హరీష్‌రావు చేసిన విమర్శలకు మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమాధానమిస్తూ.. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి రమేష్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కదిరే రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మంచారి వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ డిసిసి అధ్యక్షులు శంకర్ ప్రసాద్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

