ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణనీట్ పేపర్ లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా ప్రజా పోరాటాల విజయమే: సమాచార హక్కు...

నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా ప్రజా పోరాటాల విజయమే: సమాచార హక్కు సంరక్షణ సమితి

📰 Generate e-Paper Clip

విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలి – ఆలస్యం విరన్ డిమాండ్

ఎన్‌వీఆర్ న్యూస్ హైదరాబాద్, జూలై 25: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామ్యవాద సంస్థలు, రాజకీయ పార్టీలు చేపట్టిన నిరసనల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయడం ప్రజా పోరాటాల విజయమని సమాచార హక్కు సంరక్షణ సమితి నాయకుడు ఆలస్యం విరన్ పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలతో ఆటలాడిన ఈ కుంభకోణం భారత విద్యా వ్యవస్థపై తీవ్ర మచ్చ వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎంతో కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే, కొందరు అక్రమార్కులు డబ్బు, అధికార బలంతో ప్రశ్నపత్రాలను లీక్ చేసి విద్యా వ్యవస్థను అపహాస్యం చేశారని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర, నిష్పాక్షిక, పారదర్శక విచారణ జరిపి అసలు సూత్రధారులు, దళారులు, అధికార యంత్రాంగంలో ప్రమేయం ఉన్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల తరఫున గళమెత్తిన ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామ్యవాద సంస్థలపై ఢిల్లీ పోలీసులు ప్రదర్శించిన కఠిన వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై నమోదు చేసిన పోలీసు కేసులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఉద్యమాల సందర్భంగా జరిగిన లాఠీచార్జీల్లో గాయపడిన విద్యార్థులకు తగిన వైద్య సహాయం, ఆర్థిక సాయం అందించడంతో పాటు, బాధిత కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఉద్యమాల సందర్భంగా మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకొని తగిన ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నీట్ కుంభకోణానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థలు, జాతీయ మీడియాకు ఆలస్యం విరన్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో భవిష్యత్తులో నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు అత్యున్నత భద్రతా ప్రమాణాలు అమలు చేసి, పేపర్ లీకేజీలను పూర్తిగా నివారించేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!