
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
పుంగనూరులో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే ఎంపీ మిథున్ రెడ్డి గారితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ కూటమి నాయకులు దాడులకు పాల్పడటం, అరాచకాలకు తెగబడటం అత్యంత దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు.
కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో గట్టి బుద్ధి చెబుతారనే భయంతోనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు నుంచే దాడులు, బెదిరింపులకు దిగుతున్నారని ఆయన విమర్శించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆశించిన సంక్షేమ పథకాలు అందక ప్రజలు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం, రాజకీయ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని తోలేటి శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు ఉన్న పార్టీని దాడులతోనూ, దౌర్జన్యాలతోనూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
పుంగనూరులో జరిగిన దాడులపై పోలీసుల వ్యవహారశైలిపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. దాడులకు సంబంధించిన వాస్తవాలను నిష్పక్షపాతంగా విచారించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులతో పాటు ఎన్నికల అధికారులపై కూడా ఉందని ఆయన గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన చోట కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఎంపీ మిథున్ రెడ్డి తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులకు పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తోలేటి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల తీర్పును ఎదుర్కోవాల్సిన రాజకీయ పార్టీలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

