భద్రాచలం రామాలయ అభివృద్ధికి నిధులు కేటాయించండి.
ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కలపండి.
బూర్గంపాడు మండలాన్ని భద్రాచలం రూరల్ మండలంగా ఏర్పాటు చేయండి.
ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం స్థలం కేటాయించండి.
కేంద్రమంత్రి బండి సంజయ్ కు వినతి.
పొలిటికల్ పవర్,భద్రాచలం, సెప్టెంబర్ 09.భద్రాచలం అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ వినతిపత్రం అందించారు.
భద్రాచలం పర్యటన సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం దర్శనం అనంతరం జరిగిన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణం దక్షిణ అయోధ్యగా భారతదేశ ప్రజలందరూ ఇష్ట దైవంగా పూజించే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఈ ప్రాంతంలో ఉండడం మనందరికీ గర్వకారణ మన్నారు. పోలవరం ముంపు వలన రాముల వారి ఆలయం, పరిసర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయని, భద్రాచలం ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఈ ప్రాంత వాసులు భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బును రామాలయ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగిందని, దానితో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అయోధ్య రామ మందిరానికి ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆలయ నిర్మాణానికి సహకరించిందో అలాగే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని కూడా అంతకంటే ప్రాముఖ్యమైన దేవాలయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ఆయన కోరారు. అందుకు మీరు ప్రధానమంత్రిని కలిసి ఈ ఆలయ విషయమై చర్చించాలన్నారు. అలాగే భద్రాచలం రామాలయం అభివృద్ధితో పాటు, పోలవరం ముంపు వలన భద్రాచలం నియోజకవర్గంలోని కొన్ని మండలాలను ఆంధ్రలో కలపడం జరిగిందని, భద్రాచలం గ్రామపంచాయతీ మినహా మండలం పూర్తిగా ఆంధ్రాలో కలిపారని, భూభాగం పూర్తిగా ఆంధ్రాలోకి వెళ్లిపోవడం వలన భద్రాచలం ఎటువంటి అభివృద్ధి చేసేందుకు నోచుకోకుండా పోయిందన్నారు. తెలంగాణ సరిహద్దు పంచాయతీలైన కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలను తెలంగాణలో కలపడం వలన భద్రాచలం అభివృద్ధికి భూమి వచ్చే అవకాశం ఏర్పడుతుందని, అందుకు కేంద్ర పెద్దలతో మాట్లాడి ఆ ఐదు గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో కలిపేందుకు ముఖ్యమైన పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. భద్రాచలం అభివృద్ధి కోసం, భూమి కలవాలంటే ప్రక్కనే ఉన్న బూర్గంపాడు మండలాన్ని భద్రాచలం రూరల్ మండలం (సీతారామ మండలం) గా ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని కోరారు. దీనివలన భద్రాచలం పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. భద్రాచలం జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ నిర్మించుకునేందుకు పది సెంట్లు స్థలాన్ని కేటాయించేందుకు సంబంధితలో అధికారులతో మాట్లాడి కేటాయించేలా చొరవ తీసుకోవాలని కోరారు.
