ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపమధ్యాహ్న భోజన పథకంలో జిల్లాకు కొత్త దిశ..!

మధ్యాహ్న భోజన పథకంలో జిల్లాకు కొత్త దిశ..!

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి 

త్వరలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు స్మార్ట్ కిచెన్ పరిధిలోకి

పెండ్లిమర్రి, పులివెందుల మండలాల్లో స్మార్ట్ కిచెన్ల పరిశీలన

విద్యార్థులతో కలిసి భోంచేసి నాణ్యత, సుచీ, రుచిని పరిశీలన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ కడప, జూలై 22: జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్మార్ట్ కిచెన్ వ్యవస్థను దశలవారీగా జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం స్మార్ట్ కిచెన్ల పరిశీలనలో భాగంగా పెండ్లిమర్రి మండలం వెల్లటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పులివెందుల బాలురు, బాలికల జెడ్పి ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, కిచెన్లలో ఆహార తయారీ, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు, రవాణా, పాఠశాలలకు భోజనం చేరవేత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పులివెందులలో జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ… గత ఏడాది కడప నగర పాలక సంస్థ పరిధిలోని రెండు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ కిచెన్లు విజయవంతం కావడంతో, ఆ అనుభవాన్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను స్మార్ట్ కిచెన్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో 20 స్మార్ట్ కిచెన్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, వచ్చే వారంలో మరో 13 స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రతి స్మార్ట్ కిచెన్ పరిధిలో దశలవారీగా మరో ఒకటి లేదా రెండు పాఠశాలలను చేర్చుతూ వ్యవస్థను విస్తరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 32 వేల మందికి పైగా విద్యార్థులకు స్మార్ట్ కిచెన్లలో తయారైన పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందిస్తున్నామని.. ఈ వ్యవస్థను మరింత విస్తరించి ప్రతిరోజూ లక్ష మంది విద్యార్థులకు సెంట్రల్ స్మార్ట్ కిచెన్ల ద్వారా భోజనం అందించే బృహత్తర కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సాంకేతికత, పటిష్టమైన నిర్వహణ, నాణ్యత ప్రమాణాలతో ఈ కార్యక్రమం రాష్ట్రానికే కాక దేశానికీ ఆదర్శంగా నిలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. పులివెందుల మండలంలో స్మార్ట్ కిచెన్‌ ప్రారంభించిన పది రోజులు పూర్తయిందని.. సంతృప్తి కరంగా మధ్యాహ్న భోజనం అందివ్వడం జరుగుతోందన్నారు. ప్రతిరోజూ సుమారు నాలుగు వేల మంది విద్యార్థులకు భోజనం సిద్ధం చేసి సమయానికి అందిస్తున్నామని, వడ్డించే సమయానికి ఆహారం వేడిగా, రుచికరంగా, నాణ్యంగా ఉంటుందో లేదో తెలుసుకునేందుకు తానే స్వయంగా పాఠశాలలను సందర్శించి పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఆహార నాణ్యత, రుచి, ఉష్ణోగ్రత, సమయపాలన, రవాణా విధానం వంటి అంశాలను నిరంతరం పరిశీలిస్తున్నామన్నారు. స్మార్ట్ కిచెన్ వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, భోజనం చేసిన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ప్రతిరోజూ సాయంత్రం సందేశం పంపించి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి వచ్చే సూచనలు, అభిప్రాయాలను విశ్లేషించి అవసరమైన మార్పులు, మెరుగుదలలు చేపడుతున్నట్లు చెప్పారు. స్మార్ట్ కిచెన్లలో మహిళా సంఘాల సభ్యులు, కిచెన్ మేనేజర్లు, వంట నిర్వాహకులు, ఆహారాన్ని రవాణా చేసే వాహనాల డ్రైవర్లు, ప్రధానోపాధ్యాయులతో మాట్లాడిన కలెక్టర్, విద్యార్థులకు ఇంటి భోజనం మాదిరిగా రుచికరమైన, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందేలా అత్యంత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. మహిళా సంఘాల సమర్థ నిర్వహణ వల్లే స్మార్ట్ కిచెన్ వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతోందని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధనతో పాటు బూట్లు, దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ఇతర సౌకర్యాలు ఇప్పటికే ప్రభుత్వం అందిస్తోందని, ఇప్పుడు స్మార్ట్ కిచెన్ల ద్వారా రుచికరమైన, పౌష్టికాహారంతో కూడిన పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

పులివెందులలో జెడ్పి బాలుర హై స్కూల్ లో.. స్మార్ట్ కిచెన్ భవనాల నిర్మాణం, ఆకర్షణీయమైన గోడ చిత్రాలు, ప్రదర్శన బోర్డులు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించిన అనంతరం.. బాలికల ప్రభుత్వ పాఠశాలలో.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న తీరును, వంట నిర్వాహకులు పాటిస్తున్న పరిశుభ్రత ప్రమాణాలను జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, అన్నం, కూరలు, ఇతర ఆహార పదార్థాలను స్వయంగా రుచి చూసి వాటి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై “భోజనం ఎలా ఉంది? రుచిగా ఉందా? పరిశుభ్రంగా అందుతున్నదా?” అని అడిగి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దీనికి స్పందించిన విద్యార్థులు, “భోజనం చాలా రుచిగా ఉంది. గతంలో కంటే ఇప్పుడు మరింత నాణ్యంగా, పరిశుభ్రంగా అందుతోంది” అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, మున్సిపల్ కమిషనర్ తనూజ, డీఈవో శంశుద్దీన్, ఎస్ఎస్ఏ పివో అనురాధా, డీఆర్డీఏ పీడి రాజ్యలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు, పీఆర్ ఎస్ఈ మద్దన్న, ఏపీ సీఎన్ఎఫ్ డిపిఎం ప్రవీణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, కిచెన్ మేనేజర్లు, ఫుడ్ ట్రక్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!