
కొత్తగూడెం, అక్టోబర్ 29 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్, కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీపై కొందరు అసత్య, నిరాధార కథనాలు ప్రచారం చేస్తూ ప్రజలను, వ్యాపారులను తప్పుదోవ పట్టిస్తున్నారని సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్ ఆరోపించారు. మార్కెట్ కమిటీపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆయన సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు బోడ బాలు నాయక్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మార్కెట్ కమిటీలో ట్రేడ్ లైసెన్సుల జారీ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే జరుగుతుందని తెలిపారు. లైసెన్సుల మంజూరులో స్థానిక మార్కెట్ కమిటీకి నిర్ణయాధికారం ఉండదని, సంబంధిత ప్రభుత్వ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రాష్ట్రస్థాయి అధికారులు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారని వివరించారు. ఈ ప్రక్రియలో స్థానిక మార్కెట్ కమిటీ పాత్రపై వాస్తవాలు తెలుసుకోకుండా అవినీతి ఆరోపణలు చేయడం సరికాదని భూక్య శ్రీను నాయక్ అన్నారు. ఒక గిరిజన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని బదనాం చేసేలా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాల వల్ల మార్కెట్ కమిటీ ప్రతిష్ఠకు భంగం కలగడంతో పాటు వ్యాపారుల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ట్రేడ్ లైసెన్స్ ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ పద్దతిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతుందని అందులో మార్కెట్ కమిటీకి ఎలాంటి సంబంధం ఉండదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. ఈ సమావేశంలో సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, జిల్లా కార్యదర్శి సురేష్ నాయక్, జిల్లా ప్రచార కార్యదర్శి జరపల లాలు నాయక్, మండల అధ్యక్షుడు బోడ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

