ePaper
Monday, August 31, 2026
📄 ePaper
Homeతెలంగాణయంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అనే రేవంత్ బ్రాండ్ ఫ్లాప్ షో!

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అనే రేవంత్ బ్రాండ్ ఫ్లాప్ షో!

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ రెండేళ్లలోనే రూ 188 కోట్లు ఖర్చు చేసి శిక్షణ ఇచ్చింది కేవలం 1000 మంది విద్యార్థులకే కేసీఆర్ హాయంలో తీసుకొచ్చిన టాస్క్ అనే సంస్థకు పోటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని తెచ్చి బొక్కబోర్లా పడ్డ రేవంత్ కేసీఆర్ హాయంలో 8,37,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా, రేవంత్ రెండేళ్లలో శిక్షణ ఇచ్చింది 1000 మంది విద్యార్థులకే

శిక్షణ పొందిన 1000 మందిలో సుమారు 300 మంది స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్

ఇప్పటికే మార్కెట్లో శిక్షణ ఇస్తున్న ప్రైవేటు శిక్షణా సంస్థలు, విద్యా సంస్థలతో చేతులు కలిపి స్కిల్స్ యూనివర్సిటీ పేరు మీద ఆఫర్ కేసీఆర్ ఆనవాలు తుడిచేస్తా అంటూ బీరాలు పలికే రేవంత్ రెడ్డి మరోసారి బొక్కబోర్లా పడ్డాడు. తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి, విజయవంతంగా నడుస్తున్న సంస్థను కాదని దురుద్దేశంతో కొత్త సంస్థను పెట్టించిండు రేవంత్ రెడ్డి. అయితే రెండేళ్లు దాటినా అచ్చు ఆయన నడుపుతున్న సర్కారు లాగానే ఈనాటికీ సదరు సంస్థ బాలారిష్టాలు దాటక, సరిగ్గా పట్టాలెక్కక, ఆపసోపాలు పడుతున్న కథ ఇది. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగు కావాలనే సదుద్దేశంతో వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) అనే సంస్థను 2015 జూన్‌లో ఏర్పాటు చేశారు. యువతకు ఉద్యోగాల కల్పన రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక ముఖ్యమైన డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటుగా ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు రావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో శ్రమించింది. అనేక దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలు సృష్టించింది. అంతటితో ఆగక ఇలా వస్తున్న కొత్త ఉద్యోగాల్లో మన తెలంగాణ యువతకు అత్యధికం దక్కాలని, అందుకోసం విద్యార్ధులకు కేవలం డిగ్రీ ఒకటే ఉంటే సరిపోదు, దానికి తోడుగా వివిధ స్కిల్స్ ఉంటే వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయనే దూరదృష్టితో ఆనాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మనసులో పుట్టిన ఆలోచనే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్). సంస్థ ఏర్పాటుకాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలతో అవగాహన కుదుర్చుకుంది టాస్క్. మరోవైపు కొత్తగా పెట్టుబడులు పెడుతున్న సంస్థలతో మాట్లాడి వారికి ఏయే స్కిల్స్ ఉన్న వ్యక్తులు కావాలో తెలుసుకుని, ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చింది టాస్క్ ఇట్లా 2015 నుండి 2023 మధ్యలో 8,37,000 మంది తెలంగాణ బిడ్డలకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి అనేకమందికి ఉద్యోగాలు దక్కేలా కృషి చేసింది టాస్క్. ఎన్నో రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా టాస్క్ మోడల్‌ను ప్రశంసించి, కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తమ పథకాల్లో కూడా అమలుచేశాయి. 2023 డిసెంబర్‌లో గద్దెనెక్కిన తరువాత టాస్క్‌ను ఇంకా బలోపేతం చేయాల్సిన రేవంత్ రెడ్డి సరిగ్గా ఈ సంస్థ చేసే పనినే చేసేందుకు “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” పేరిట మరో కొత్త సంస్థను ప్రకటించారు. ఆగస్ట్ 2024లో అట్టహాసంగా స్కిల్స్ యూనివర్సిటీకి అంకురార్పణ చేశారు. ఆనాడే అనేకమంది విద్యావేత్తలు, పరిశ్రమ వర్గాలు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే అప్పటికే విజయవంతంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్న టాస్క్ అనే సంస్థ నడుస్తుండగానే మళ్లీ అదే పని చేయడానికి మరో కొత్త సంస్థ ఎందుకు అని. నిజంగానే స్కిల్స్ యూనివర్సిటీ పేరు మీద ఏమన్నా కొత్త పనులు చేస్తారేమో అన్ని గత ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఆ సంస్థ పనితీరు చూస్తే ఇది రేవంత్ ప్రభుత్వపు మరో ఫ్లాప్ షో అని ఇట్టే అర్థమవుతుంది. స్కిల్స్ యూనివర్సిటీ పనితీరు గురించి కొంత పరిశోధన చేస్తే దిగ్భ్రాంతికరమైన అంశాలెన్నో వెల్లడయ్యాయి. 2015లో టాస్క్ మొదలైన తొలి ఏడాదిలోనే 11,000 పైచిలుకు విద్యార్ధులకు నైపుణ్య శిక్షణ ఇస్తే, భారీ బడ్జెట్ వెచ్చించి, ఎంతో పబ్లిసిటీ చేసుకున్న స్కిల్స్ యూనివర్సిటీ తొలి ఏడాదిలో ముక్కీ మూలిగీ నైపుణ్య శిక్షణ ఇచ్చింది కేవలం 1,000 మందికి! ఇక బీఆర్ఎస్ ప్రభుత్వపు చివరి సంవత్సరం 2023లో టాస్క్ సంస్థ ఏకంగా 1,84,000 విద్యార్ధులకు వివిధ నైపుణ్య శిక్షణలు ఇచ్చింది. ఇంత చక్కని సంస్థ ఉండగా కావాలనే దాన్ని నిర్వీర్యం చేసి, కేసీఆర్ ఆనవాలు లేకుండా చేసి, దాని స్థానంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తీసుకురావాలనేది రేవంత్ రెడ్డి దుర్బుద్ధి.

పాత కోర్సులకే స్కిల్స్ యూనివర్సిటీ కలరింగ్

గమనించాల్సిన విషయం ఏమిటంటే స్కిల్స్ యూనివర్సిటీ స్వంతంగా ఏమీ కోర్సులు చెప్పదు. ఆల్రెడీ మార్కెట్లో ప్రైవేటు శిక్షణా సంస్థలు, విద్యా సంస్థలు ఆఫర్ చేసే కోర్సులనే ఆయా సంస్థలో ఒప్పందం కుదుర్చుకుని స్కిల్స్ యూనివర్సిటీ పేరు మీద ఆఫర్ చేస్తుంది. ఇంతోటి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి, పబ్లిసిటీ చేసుకుంటుందో అర్థం కావట్లేదు. ఉదాహరణకు జీఎంఆర్ ఏరో అనే సంస్థ ఎప్పటి నుండో ఎయిర్‌పోర్ట్ & కార్గో ఆపరేషన్స్‌లో స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్స్ నడుపుతోంది. ఇప్పుడు అదే కోర్సును, స్కిల్స్ యూనివర్సిటీ ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి, జస్ట్ విద్యార్ధులను తీసుకెళ్లి అదే జీఎంఆర్ ఏరో సంస్థలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇదొక్కటే కాదు, స్కిల్ యూనివర్సిటీ పేరు మీద నడుస్తున్న కోర్సుల్లో 90% కోర్సులు ఇదివరకే ఆఫర్ చేస్తున్న ప్రైవేటు సంస్థల్లోనే ట్రైనింగ్ ఇస్తూ, పేరు మాత్రం స్కిల్స్ యూనివర్సిటీది పెడుతున్నారు. టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, పవర్ మెక్, ఏఐజీ హాస్పిటల్స్, నవత ట్రాన్స్‌పోర్ట్, బయలాజికల్-ఈ వంటి సంస్థలన్నీ ఇదివరకు తాము ఇస్తున్న కోర్సులనే ఇప్పుడు స్కిల్స్ యూనివర్సిటీ వెబ్‌సైట్లో పెట్టి కొత్త కోర్సులో శిక్షణ ఇస్తున్న బిల్డప్ ఇవ్వడం ఎవరిని మోసగించడానికి?

రెండేళ్లలోనే రూ 188 కోట్లు ఖర్చా?

ఇంకా షాక్ ఇచ్చే విషయం ఏమిటంటే ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న భారీ నిధులు. 2024-25 సంవత్సరంలో స్కిల్స్ యూనివర్సిటీకి రూ 75.47 కోట్లు ఖర్చు చేస్తే, అది 2025-26 నాటికి వచ్చేసరికి 113.26 కోట్లకు చేరుకుంది. అంటే కేవలం 1000 మంది విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ 188.73 కోట్లు. అంటే ఒక్కో విద్యార్ధి మీద చేసిన ఖర్చు రూ 18.87 లక్షలు అన్నట్టు. ఇంతింత ఖర్చు చేసి ఖరీదైన కోర్సులు ఏమన్నా చెబుతున్నారేమోనని స్కిల్స్ ఇండియా వారి వెబ్‌సైట్ చూస్తే మీకు దిమ్మతిరిగి బొమ్మ కనపడటం ఖాయం. శిక్షణ పొందిన 1000 మందిలో సుమారు 300 మంది స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ అవడానికి స్కిల్స్ పొందారట! ఇంత డబ్బు వెచ్చించి స్వంతంగా క్యాంపస్ ఏమన్నా కడుతున్నారేమో చూస్తే, అక్కడా వ్యవహారం అంతా గందరగోళంగా ఉంది. స్కిల్స్ యూనివర్సిటీని ప్రకటించిన కొత్తల్లోనే అదానీ కంపెనీ రూ 100 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ రూ 200 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇంత భారీ ఎత్తున ప్రైవేటు కంపెనీలు విరాళాలు ఇవ్వడం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. మరీ ముఖ్యంగా అదానీ కంపెనీకి వ్యతిరేకం అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రోజూ ఇల్లెక్కి అరుస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అదానీ కంపెనీ నుండి రూ 100 కోట్ల భారీ విరాళం స్వీకరించడం మీద విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి కాంగ్రెస్ అధిష్టానం కల్పించుకుని ఆ 100 కోట్ల విరాళం వెనక్కి ఇప్పించారు. ఇక మేఘా కంపెనీ రూ.200 కోట్ల విరాళంతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మించి ఇస్తాం అని అప్పట్లో ప్రకటించింది. రేవంత్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా శంకుస్థాపన చేసిన క్యాంపస్ నిర్మాణం నత్తనడకన నడుస్తున్నది. తొలుత తాత్కాలిక క్యాంపస్‌ను గచ్చిబౌలి సమీపంలో ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో పెట్టారు. కానీ ఎనిమిది నెలలు గడవకముందే అక్కడినుండి ఖాళీ చేసి సమీపంలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ క్యాంపస్‌కు తరలించారు.

ఇద్దరంటే ఇద్దరే!

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్వంతంగా తమ క్యాంపస్‌లోనే శిక్షణ ఇస్తున్న ఏకైక కోర్సు “సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సాఫ్ట్ స్కిల్స్”లో గత ఏడాది కాలంలో చేరిన విద్యార్ధులు ఇద్దరంటే ఇద్దరే. దీన్ని బట్టే సదరు స్కిల్స్ యూనివర్సిటీ మీద తెలంగాణ యువతకు ఉన్న నమ్మకం ఏపాటిదో తెలుస్తోంది.

ముఖ్యమంత్రి, మంత్రి నియోజకవర్గాల్లోనే శిక్షణ!

ఇక రాష్ట్రంలో మరే నియోజకవర్గంలో శిక్షణ ఇవ్వని స్కిల్స్ యూనివర్సిటీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో 180 మందికి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియోజకవర్గం మంథనిలో 60 మందికి శిక్షణ ఇవ్వడం గమనార్హం. శిక్షణకు నోచుకోని రాష్ట్రంలోని మిగతా 117 నియోజకవర్గాలు ఏం పాపం చేశాయో మరి! కనీసం ఇదైనా ఏమన్నా పనికొచ్చే శిక్షణ అనుకునేరు. కేవలం నాలుగు రోజుల్లోనే ముగిసిన మొక్కుబడి ట్రైనింగ్ ఇది.

నానాటికీ తీసికట్టు…

ఇంకో గమనార్హమైన విషయం – నిజంగానే వీళ్లు ఇచ్చే శిక్షణ బాగుంటే తొలి బ్యాచ్ కంటే రెండో బ్యాచ్‌లో ఎక్కువమంది విద్యార్ధులు చేరాలి. కానీ దాదాపు ప్రతి కోర్స్‌లో మొదటి బ్యాచ్‌తో పోలిస్తే రెండో బ్యాచ్‌లో విద్యార్ధులు తగ్గడం ఈ కోర్సుల నాణ్యతలేమికి ఒక ఉదాహరణ. లాజిస్టిక్స్ & సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్ కోర్సులో తొలి బ్యాచ్‌లో 25 మంది విద్యార్ధులు చేరితే, రెండో బ్యాచ్ వరకు అది 13కు దిగజారింది. ఎండోస్కోపీ టెక్నీషియన్ తొలి బ్యాచ్‌లో 21 మంది విద్యార్ధులు చేరితే, రెండో బ్యాచ్ వరకు ఆ సంఖ్య 15కు తగ్గింది. జావా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కోర్సు పరిస్థితి అంతే. తొలి బ్యాచ్‌లో 24 మంది చేరితే రెండో బ్యాచ్ వరకు సగానికి తగ్గి 14కు చేరింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన గత ప్రభుత్వం చేసిన ఒక మంచి పనిని కొనసాగించే మనసు లేక, కొత్తగా ఏదో చేస్తానని బయలుదేరిన రేవంత్ స్కిల్స్ యూనివర్సిటీ తొలి రెండేళ్ల ప్రస్థానం ఆయన తలపెట్టిన మిగతా పనుల్లాగానే పూర్తి ఫ్లాప్ షోగా మారింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!