ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిరైతాంగాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు

రైతాంగాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు

📰 Generate e-Paper Clip

రైతుబంధులో జాప్యం.. వరి కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై పెద్దమందడిలో బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21 2026: రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతాంగాన్ని మోసం చేస్తూ కాలయాపన విధానాలను అనుసరిస్తోందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుబంధు నిధుల విడుదలలో జాప్యం చేయడంతో పాటు వరి కొనుగోళ్లను సక్రమంగా నిర్వహించకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రైతాంగ సమస్యలను పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం పెద్దమందడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతుబంధు, పంటల కొనుగోళ్లు, సాగునీటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రైతుల సంక్షేమం గురించి మాటలు చెప్పడం తప్ప చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.అనంతరం మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… రైతుల కష్టాలను అర్థం చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అవ్యవస్థ నెలకొనడంతో రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగానికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోందని ఆరోపించారు. పంట పండించిన రైతుకు కనీస గౌరవం కూడా లేకుండా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ నాయకుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడి వెంటనే పెండింగ్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు నిధులను తక్షణమే విడుదల చేయడంతో పాటు వరి కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… రైతన్నల సంక్షేమాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. రైతుల ఆవేదనను విస్మరిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేణు యాదవ్, వెల్టూర్ సర్పంచ్ అశోక్, అల్వాల సర్పంచ్ రాజమహేందర్ రెడ్డి, కుమార్ యాదవ్, అల్వాల వెంకట్ రెడ్డి, నాగేంద్రం యాదవ్, గట్ల ఖనాపుర్ శ్రీను, బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!