రైతు ఫర్టిలైజర్ యాప్ను ఉపసంహరించుకుని పాత విధానంలోనే యూరియా పంపిణీ
రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక:
పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 03 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు మాట్లాడుతూ, రైతులకు అవసరమైన మేర యూరియాను ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని, పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు ఫర్టిలైజర్ యాప్ కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. వ్యవసాయ పనులు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా కొరత ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. యాప్లో సాంకేతిక సమస్యలు, నెట్వర్క్ అంతరాయాల కారణంగా రైతులు గంటల తరబడి ఎరువుల దుకాణాల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాత విధానంలోనే యూరియా పంపిణీ చేపట్టాలని, రైతులకు అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉంచి ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు మాట్లాడుతూ… రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని, యూరియా సరఫరాను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. రైతుల ప్రయోజనాలను విస్మరిస్తే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, సీపీఎం నాయకులు మోరంపూడి వెంకట్రావు, చావా రమేష్, చప్పిడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

