ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంసత్తుపల్లిలో 15 వేల మందితో భారీ 77వ వనమహోత్సవ ర్యాలీ

సత్తుపల్లిలో 15 వేల మందితో భారీ 77వ వనమహోత్సవ ర్యాలీ

📰 Generate e-Paper Clip

77 వ వనమహోత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ దివాకర్

మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యతే

పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 03 2026: ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సుమారు 15,000 మందితో భారీ వనమహోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం సత్తుపల్లి పట్టణంలో పర్యావరణ పరిరక్షణపై విశేష చైతన్యాన్ని తీసుకువచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రోత్సాహంతో నిర్వహించిన 77వ వనమహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. జేవీఆర్ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించిన 77వ వనమహోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా మారింది. విద్యార్థులు, యువత, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో జేవీఆర్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. అనంతరం జేవీఆర్ కాలేజ్ నుంచి పాత సెంటర్ మీదుగా భారీ ర్యాలీ కొనసాగింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణపై తమ మద్దతును తెలియజేశారు. ర్యాలీలో జానపద కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ర్యాలీలో పాల్గొని వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ… “ఇంత భారీ స్థాయిలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయం. నేను ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలతో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి” అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ… సత్తుపల్లి నియోజకవర్గం విద్య, అభివృద్ధి, సామాజిక చైతన్యంలో ముందంజలో ఉందని, ఈ భారీ వనమహోత్సవ ర్యాలీ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక గుర్తింపును పొందుతుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ… విద్యార్థులంతా మంచి పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, అలాగే వనాల ప్రాధాన్యతను తెలుసుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, డీఎఫ్‌వో, ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!