ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయంసెక్యూరిటీ కోసం రిక్వెస్ట్

సెక్యూరిటీ కోసం రిక్వెస్ట్

📰 Generate e-Paper Clip

20 కోట్లు ఆఫర్.

సెక్యూరిటీ కోసం చంద్రబాబుకు దస్తగిరి రిక్వెస్ట్.!

మాజీ మంత్రి, జగన్‌ బాబాయి YS వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి మంగళవారం మీడియా ముందుకు వచ్చి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నిందితులను కాపాడేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని, తనకు కోర్టు ఇచ్చిన అప్రూవర్ అనుమతిని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు, తన కుటుంబానికి పూర్తిస్థాయిలో సెక్యూరిటీ కల్పించాలని సీఎం చంద్రబాబును ఆశ్రయించారు.

వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించి సాక్ష్యాలు తారుమారు చేసిన శక్తులు ఎవరో అందరికీ తెలుసని దస్తగిరి స్పష్టం చేశారు. వైఎస్ సునీత గత ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతుంటే.. ఆమెకు అండగా నిలవాల్సిందిపోయి, నిందితులైన YS అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి తదితరులకు వైసీపీ రాజకీయ రక్షణ కల్పిస్తోందని విమర్శించారు. వివేకా హత్య వెనక ఉన్న కుట్రలు, ఆర్థిక లావాదేవీల మూలాలు పూర్తిగా వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. జగన్, ఆయన సతీమణి భారతి CBI, ED విచారణకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించిన ఆయన.. ఈ కేసులో మనీలాండరింగ్ ఎలా జరిగిందనే వివరాలను ఇటీవల ED విచారణలో తాను స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తనకు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాయే లాయర్‌ అంటూ జగన్ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని దస్తగిరి తేల్చిచెప్పారు. సిద్ధార్థ లూథ్రా తన తరఫున ఎప్పుడూ, ఏ కోర్టులోనూ వకల్తా పుచ్చుకోలేదన్నారు. ఒకవేళ ఆయన తన తరఫు న్యాయవాదని జగన్ నిరూపిస్తే తాను జైలుకెళ్లేందుకైనా సిద్ధమని, ఒకవేళ నిరూపించలేకపోతే జగన్ రాజకీయ సన్యాసం చేస్తారా అని సవాల్ విసిరారు. అప్రూవర్‌గా తన విశ్వసనీయతను దెబ్బతీసేందుకే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన న్యాయవాదులపై తప్పుడు కథనాలు సృష్టించి ప్రాణాలకు ముప్పు తెస్తున్న జగన్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

CBIకి వ్యతిరేకంగా మాట్లాడితే రూ.20 కోట్లు ఇస్తామంటూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి తనకు ఆఫర్ ఇచ్చారని, ఆ ప్రలోభానికి లొంగకుండా నిజం వైపు నిలబడినందుకే తనను తీవ్రంగా బెదిరించారని దస్తగిరి వెల్లడించారు. వైసీపీ హయాంలో తనపై అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్ తెరిచారని ఆరోపించారు. చైతన్యరెడ్డితో పాటు పలువురు పోలీసు, జైలు అధికారులు తనను భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొంటూ.. ఇప్పటికీ విధుల్లో ఉన్న జైలు అధికారి ప్రకాశ్, డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్యలను వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని కోరారు.

2025లో ఇచ్చిన జీవో 137 ప్రకారం తాను కేటగిరీ-A కిందకు వచ్చే అత్యంత కీలక సాక్షినని దస్తగిరి గుర్తుచేశారు. తన కుటుంబ రక్షణకు అయ్యే నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని కోరారు. శత్రువుల నుంచి ఎలాంటి ముప్పు లేని సురక్షిత నివాసానికి తమను మార్చాలని, పూర్తిస్థాయి పోలీసు భద్రతతో పాటు ఎస్కార్ట్ కల్పించాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్థించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!