
టేకులపల్లి (పొలిటికల్ పవర్/PN9 న్యూస్), నవంబర్ 27:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామంలో వైకుంఠధామానికి సరైన దారి లేక గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుమారు 200 సంవత్సరాలుగా గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించడానికి దారి లేకపోవడంతో శవాలను మోసుకెళ్లేందుకు పడుతున్న నరకయాతన వర్ణనాతీతంగా మారింది.
ప్రభుత్వం గ్రామానికి వైకుంఠధామాన్ని (స్మశాన వాటిక) మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ, దానికి వెళ్లేందుకు కనీస రహదారి సౌకర్యం కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో ఎవరైనా మరణిస్తే, వారి అంతిమ యాత్రను గుంతలు, చెట్లు, పొలాల గుండా అత్యంత దిగ్భ్రాంతికర వాతావరణంలో నిర్వహించాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ – “నాయకులు కేవలం ఓట్ల కోసమే మమ్మల్ని చూస్తున్నారు తప్ప, మా కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నో ఏళ్లుగా విన్నవించినా ఏ ఒక్క అధికారి గానీ, ప్రజాప్రతినిధి గానీ స్పందించలేదు” అని మండిపడ్డారు.
ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కన్నుతెరిచి శంభునిగూడెం గ్రామంలో సమగ్ర దర్యాప్తు జరిపించి, వైకుంఠధామానికి శాశ్వత రహదారి సౌకర్యం కల్పించి ఇబ్బందులను తొలగించాలని గ్రామ ప్రజలు సవినయంగా కోరుతున్నారు.
(రిపోర్టింగ్: కె.ఎస్.టి. సత్యప్రసాద్, టేకులపల్లి ప్రతినిధి)

