విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా బ్యూరో పి ఎల్ మూర్తి అల్లూరి సీతారామరాజు జిల్లాలో జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామాలు, గల్లీలు, వాడవాడల్లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతుండటంతో యువత మద్యానికి బానిసలై మత్తులో కాలం గడుపుతున్నారని చెబుతున్నారు. దీనివల్ల కుటుంబ కలహాలు పెరగడంతో పాటు యువకులు తమ తల్లిదండ్రులు, బంధువులను సైతం ఎదిరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది. అధికారిక మద్యం దుకాణాలు పరిమిత సంఖ్యలో ఉండగా, బెల్ట్ షాపులు మాత్రం లెక్కకు మించి పెరిగిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. వైన్ షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాలు, శివారు ప్రాంతాల్లోని బెల్ట్ షాపుల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి హుకుంపేట మండలంలో బెల్ట్ షాపుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, కొందరు వ్యక్తులు వాహనాల ద్వారా రోజుకు పలుమార్లు మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని మహిళలు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్లుతెరిచి అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి, బెల్ట్ షాపులను నిర్మూలించాలని ప్రజలు, మహిళలు కోరుతున్నారు.
