*స్థలాల సాధనే లక్ష్యం…పాదయాత్ర ఆరంభమే..!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి
* ఖమ్మం జిల్లా* టీడబ్ల్యూజేఎఫ్ ఇండ్ల స్థలాల పాదయాత్ర ముగింపు సభలో ఫెడరేషన్ రాష్ట్ర నేతలు రఘు, రాజశేఖర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి
* * మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు: కాంగ్రెస్ నేతలు నూతి, పువ్వాళ్ల
** జర్నలిస్టుల ప్రతీ పోరాటానికీ మద్దతు : వామపక్షాల నేతలు నున్నా, బాబు, పుల్లయ్య, మధు
** టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్రకు ప్రజాసంఘాలు, పార్టీల సంఘీభావం…* భవిష్యత్తు పోరాటాలకు తోడుంటామని హామీ
ఖమ్మం : ఇండ్ల స్థలాల సాధనలో పాదయాత్ర ఆరంభం మాత్రమేనని… అవి సాధించేవరకూ ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ – హెచ్ -2843) రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగే రఘు, బి. రాజశేఖర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల కోసం టీడబ్ల్యూజేఎఫ్ చేస్తున్న పోరాటానికి అండగా నిలవాల్సిన మిగిలిన జర్నలిస్టు సంఘాలు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత నెల 22వ తేదీ నుంచి చేపట్టిన పాదయాత్ర శనివారం ఖమ్మం నియోజకవర్గంలో కొనసాగింది. అనంతరం ఎస్ఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర, జిల్లా నేతలు ప్రసంగించారు. ముందుగా ఇటీవల ఆకస్మిక మృతి చెందిన జర్నలిస్టులు కూరాకుల గోపి, సత్యానందం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొనసాగిన సభలో టీడబ్ల్యూజేఎఫ్ నేతలు ప్రసంగించారు.
* జర్నలిస్టులే జర్నలిస్టుల గొంతును నొక్కే యత్నం: టీడబ్ల్యూజేఎఫ్
జర్నలిస్టులే జర్నలిస్టుల గొంతును నొక్కే చర్యలను ఇప్పటికైనా విరమించుకోవాలని… ఇండ్ల స్థలాలు జర్నలిస్టుల చిరకాల వాంఛ అని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగే రఘు, బి. రాజశేఖర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి సూచించారు. టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ముందుకు వచ్చిన వివిధ యూనియన్ ల జర్నలిస్టులను అడ్డుకునే చర్యలు సహేతుకం కాదన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంతవరకు ఎటువంటి పోరాటానికైనా వెనుకాడేది లేదన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకూ పూనుకుంటామని హెచ్చరించారు. ఏ కోటాలో ఏ ప్రాతిపదికనైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వివిధ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు పోరాటాలకూ వెన్నుదన్నుగా నిలవాల్సిందిగా కోరారు. పాదయాత్ర అంటే పాదాలమీద నడిచే యాత్ర కాదని… ప్రాణం పెట్టి నడిచే యాత్ర అని పేర్కొన్నారు.
* మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం : కాంగ్రెస్ నేతలు
జిల్లా మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల దృష్టికి తీసుకు వెళ్లి ఇండ్లస్థలాల సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో ఏ రాజకీయ పార్టీకీ అభ్యంతరాలు లేవని, అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయన్నారు. అయినప్పటికీ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ఏర్పడుతున్న అవరోధాలను అధిగమించి ముందుకు వెళ్లే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
* జర్నలిస్టుల ప్రతి పోరాటానికీ మద్దతు : వామపక్షాలు, ప్రజాసంఘాలు నేతలు
జర్నలిస్టుల ప్రతి పోరాటానికీ తమ మద్దతు ఉంటుందని వామపక్షాల నేతలు సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకులు ఎర్ర బాబు, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నేత సీవై పుల్లయ్య, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మధు, సామాజిక తెలంగాణ నాయకులు డాక్టర్ కేవీ కృష్ణారావు, బీఎస్పీ నాయకులు ఉపేందర్ సాహు, ముస్లిం లీగ్ నాయకులు బాజీబాబా, తెలంగాణ మైనార్టీ ఉద్యోగుల సంఘం నాయకులు అస్లాంఖాన్, ప్రకటించారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం పాదయాత్ర చేపట్టిన టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ నేతలను అభినందించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో టీడబ్ల్యూజేఎఫ్ చేపట్టిన ప్రతి ఆందోళనకూ అండగా ఉన్నామని, భవిష్యత్తులో చేపట్టే ఆందోళనలకూ మద్దతుగా నిలుస్తామన్నారు. ప్రభుత్వాలు స్పందించి చట్టబద్ధంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోతే ఎర్ర జెండాలు పాతైనా స్థలాలు ఇప్పిస్తామన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్రకు అడుగడుగునా సంఘీభావం సభకు ముందు టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం నియోజకవర్గం లో చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. టీఆర్ఎస్, బీఎస్ఎఫ్ ఐ నేతలు మద్దతు ప్రకటించారు. పాదయాత్రలో భాగంగా ఖమ్మం అర్బన్, రూరల్, రఘునాథపాలెం తహశీల్దారు లకు వినతిపత్రాలు సమర్పించారు. వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్బన్ తహశీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర కాల్వొడ్డు, మయూరి సెంటర్, వైరా రోడ్, ఇల్లందు క్రాస్ రోడ్ మీదుగా రఘునాథపాలెం తహశీల్దారు కార్యాలయం వరకూ సాగింది. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా సాగిన పాదయాత్ర బృందాన్ని పలువురు సన్మానించారు.ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు, టీబీజేఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, మానుకొండ రవికిరణ్, వ్యవస్థాపక అధ్యక్షులు పారుపల్లి కృష్ణారావు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు నలుబోల మధుశ్రీ, సీహెచ్ బాలకృష్ణ, చక్రవర్తి, యాకేష్, జానీపాష, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి మాధవరావు, ఫయాజ్, గణేష్, శరత్, గోపీ, రాంబాబు, అర్షద్, కర్ణ, లక్ష్మారెడ్డి, మోహన్ రావు,, భవాని, వేణు, గంగాధర్, జి. వెంకటేశ్వర్లు, కిరణ్, పవన్, వెంకటేశ్, అంజయ్య, జావీద్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.



