ePaper
Tuesday, September 8, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బీసీలపై చంద్రబాబు మాటలు మోసం.. 34 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఎక్కడ?: మాజీ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట: ఎన్నికల ముందు బీసీలు గుర్తుకొస్తారు.. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీలను మర్చిపోవడం చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారిందని మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు.

పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారి అధ్యక్షతన నరసరావుపేటలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత ఎన్నికల తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన అరాచకాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన వేధింపులు అందరికీ తెలుసన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడా వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎలాంటి బెదిరింపులకు, ఒత్తిళ్లకు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి చోట ధైర్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ఒక్కో స్థానానికి ఒక నామినేషన్‌తో ఆగకుండా నాలుగు నామినేషన్లు వేసేలా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని రజిని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు.

అప్పుడు ఆ రిజర్వేషన్లను అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం బీసీ లను మభ్యపెట్టడమేనన్నారు.

“చంద్రబాబుకు ఎన్నికల ముందు మాత్రమే బీసీలు గుర్తుకొస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీలను పట్టించుకోరు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయడం చంద్రబాబు రాజకీయ విధానం” అని రజిని విమర్శించారు.

బీసీలకు నిజంగా న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే.. కేవలం ప్రకటనలు, హామీలతో కాకుండా ఆచరణలో చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా, ధైర్యంగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని రజిని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!