డాక్టర్ గోపీనాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఖమ్మం నగరం: తెలంగాణ మట్టిలో పుట్టిన కొన్ని వ్యక్తిత్వాలు కాలంతో కొలవబడవు. పోరాటాలతో కొలవబడతాయి. పదవులతో కొలవబడవు. ప్రభావంతో కొలవ బడతాయి. అలాంటి అరుదైన వ్యక్తిత్వాల్లో డాక్టర్ ఎం. ఎఫ్. గోపీనాథ్ ఒక శిఖరం. ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, అయ్యవారిగూడెం పల్లె నేల నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం భారత వైద్య రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన స్థాయికి చేరుకుంది. దేశంలో తొలి దళిత కార్డియాలజిస్టులలో ఒకరిగా నిలిచిన ఆయన జీవితం శ్రమకు సంకల్పానికి ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. డాక్టర్ గోపీనాథ్ పేరు వినగానే గుర్తుకు వచ్చేది ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవం ఆయన గర్వం తరతరాలుగా అణచివేతను ఎదుర్కొన్న సమాజం తలెత్తుకుని నిలబడిన చరిత్ర. ఆయన మాటల్లోనూ రచనల్లోనూ ఉద్యమాల్లోనూ అదే స్పూర్తి ప్రవహిస్తుంది. అందుకే ఆయన వ్యక్తిత్వం వేలాది మందిలో ధైర్యాన్ని నింపుతుంది. విద్యార్థి ఉద్యమాల చరిత్రలో 1978 నుండి 1982 వరకు సాగిన ఆయన నాయకత్వం ఒక ప్రత్యేక అధ్యాయం. రాడికల్ విద్యార్థి ఉద్యమాలను ( ఆర్ ఎస్ యు ) ప్రజల సమస్యలతో ముడిపెట్టి, విద్యార్థి శక్తిని సామాజిక మార్పు దిశగా నడిపించిన నాయకత్వం ఆయనది. తెలంగాణ నేలపై ప్రశ్నించే గొంతుకలను ప్రతిఘటించే పిడికిళ్లను ఆలోచించే యువతను తీర్చిదిద్దిన ఉద్యమ తరానికి ఆయన ఒక దిక్సూచి. డాక్టర్ గోపీనాథ్ వ్యక్తిత్వంలో ఒక విశేషం ఉంది. పరిస్థితులను చదివే దూరదృష్టి, వ్యవస్థలను అర్థం చేసుకునే విశ్లేషణ, సమాజాన్ని లోతుగా పరిశీలించే చైతన్యం ఆయన ఆలోచనలకు ప్రత్యేక బలం ఇచ్చాయి. అందుకే ఆయన మాటలు చర్చలకు దారితీస్తాయి. ఆయన విశ్లేషణలు ఆలోచనలను కదిలిస్తాయి. ఆయన ప్రశ్నలు వ్యవస్థలను ఆత్మపరిశీలన చేయిస్తాయి. వైద్యుడిగా ఆయన చేతులు వేలాది గుండెలకు భరోసా ఇచ్చాయి. స్పందన హార్ట్ కేర్ సెంటర్ ద్వారా ప్రజలకు అందించిన సేవలు వైద్య రంగంలో ఆయనకు ప్రత్యేక స్థానం తీసుకువచ్చాయి. రోగి బాధను అర్థం చేసుకునే హృదయం, వైద్య విజ్ఞానాన్ని సమాజ ప్రయోజనంతో మేళవించే దృక్పథం ఆయన సేవల మూలసారం.
రచయితగా ఆయన కలం కూడా ఉద్యమ జ్వాలను మోసుకువచ్చింది. “నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం!”,
“కులాంకలి”, “నా మంచం నా ఇష్టం” వంటి రచనలు పాఠకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. ఆయన వాక్యాల్లో కనిపించే పదునూ, జీవితంలో కనిపించే నిబద్ధత ఒకే మూలం నుంచి పుట్టినవి. ఫూలే–అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషి విశేషం. సామాజిక న్యాయం, సమానత్వం ఆత్మగౌరవం విద్య, ఈ నాలుగు స్తంభాల మీద ఒక చైతన్య సమాజాన్ని నిర్మించాలని ఆయన కలలు కన్నారు. ఆ కలలను కార్యరూపంలోకి తీసుకు రావడానికి నిరంతరం శ్రమిస్తున్నారు, డాక్టర్ ఎం. ఎఫ్. గోపీనాథ్ అంటే ఒక జీవన పాఠం. ఒక ఉద్యమ స్ఫూర్తి. ఆత్మ గౌరవానికి చిరునామా. ప్రశ్నించే మనస్సుల ఆత్మీయుడు. తెలంగాణ పోరాట సంప్రదాయానికి సజీవ ప్రతిరూపం. కాలం ముందుకు సాగుతుంది. తరాలు మారుతాయి. పరిస్థితులు మారుతాయి. కానీ ఆత్మగౌరవంతో జీవించిన వ్యక్తిత్వాలు ప్రజల జ్ఞాపకాలలో ఉద్యమాల చరిత్రలో సమాజ చైతన్యంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి చిరస్థాయి సంతకం
– డాక్టర్ ఎం. ఎఫ్. గోపీనాథ్.
గుండె డాక్టర్ కి జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో
రిటైర్డు రెవెన్యూ ఉద్యోగులు తెలగమళ్ళ గోవిందు రాజ్యాంగ రక్షణ సమితి 
రాష్ట్ర నాయకులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు చిలకబత్తిని కనకయ్య, మాల మహానాడు జిల్లా నాయకులు దాసరి శ్రీను, తెలంగాణ లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు బద్రునాయక్, కరాటే వేణు, మేకల రవి, ఖమ్మం జిల్లా మాల మహానాడు మీడియా కన్వీనర్ పాగ యోనా తదితరులు డాక్టర్ ఎం ఎఫ్ గోపీనాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు


