ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నియంత్రణ ఎక్కడ..?

ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నియంత్రణ ఎక్కడ..?

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ న్యూస్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూన్ 19 2026: ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిజంగా పాటిస్తున్నాయా అనే ప్రశ్న తల్లిదండ్రుల నుంచి బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తుండగా, పుస్తకాలు, యూనిఫారాలు, ఇతర అవసరాల పేరుతో మరో రూ.10 వేల వరకు అదనపు భారం మోపుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల కష్టార్జిత సంపాదనలో అధిక భాగం పిల్లల విద్యకే ఖర్చవుతోందని, ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఫీజుల భారం భయాందోళనకు గురిచేస్తోందని వారు చెబుతున్నారు. ఫీజులను నియంత్రించాల్సిన విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫీజుల పెంపుపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికీ, అధికారిక ఫిర్యాదులు తక్కువగా రావడాన్ని సాకుగా చూపుతూ ప్రభుత్వం, అధికారులు చర్యలకు వెనుకాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలోనే ఇంత భారీగా ఫీజులు ఉంటే, పై తరగతులకు వెళ్లే కొద్దీ పరిస్థితి మరింత భారంగా మారుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కొందరు అయితే పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని, మరికొందరు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విద్య ప్రతి చిన్నారి హక్కు అయినప్పటికీ, అది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అందని ద్రాక్షలా మారుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలకు పంపాలంటే సందేహాలు, మరోవైపు ప్రైవేట్ పాఠశాలల భారీ ఫీజులు భరించలేక మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రభుత్వం అనుమతించిన ఫీజుల వివరాలను ప్రతి ప్రైవేట్ పాఠశాలలో అందరికీ కనిపించేలా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్య వ్యాపారంగా కాకుండా సేవగా ఉండేలా ప్రభుత్వం, విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!