ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంరైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం... డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం… డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

📰 Generate e-Paper Clip

తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద రైతు ఆశీర్వాద సభకు చింతకాని వేదిక

9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టి పెట్టాలి

150 స్టాల్స్ ఏర్పాటు అంచనాలకు మించి 11 వేల మంది రైతుల హాజరు మెగా రైతు మేళాలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం/ చింతకాని:

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ రైతు ఆశీర్వాద సభ నుంచి రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. చింతకాని మండలం జగన్నాధపురం మత్కేపల్లి క్రాస్ రోడ్డు లో గురువారం నిర్వహించిన మెగా రైతు మేళాకు రైతులు విశేషంగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మంత్రివర్గం రైతుల అవసరాలు, వ్యవసాయ రంగ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందన్నారు. విత్తనం వేసినప్పటి నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి దశలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమంపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని, తమ ప్రభుత్వం మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపించే ప్రభుత్వమని అన్నారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, కడెం వంటి సాగునీటి ప్రాజెక్టులు నేటికీ రైతులకు నీరందిస్తున్నాయని, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగిపోవడం ఆ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ప్రతి కుటుంబానికి వ్యవసాయంతో అనుబంధం ఉందని, అందుకే ఇక్కడ రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ధాన్యం, మొక్కజొన్న తదితర పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేశామని తెలిపారు. వ్యవసాయ ఆధునికీకరణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును విస్తరిస్తున్నామని తెలిపారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యామ్నాయ పంటలపై శాస్త్రవేత్తలతో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూలై 10న జరిగే రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి సహా తెలంగాణ మంత్రివర్గం మొత్తం హాజరవుతుందని అన్నారు. ప్రస్తుతం రైతులకు అందుతున్న ప్రతి నీటి చుక్క కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే వస్తోందని తెలిపారు. రైతులను మాయమాటలతో మోసం చేసే పార్టీలకు ప్రజలు అవకాశం ఇవ్వబోరని అన్నారు. రైతు సంక్షేమానికి పునాదులు వేసిన ప్రభుత్వాలను రైతులే కాపాడుకుంటారని, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. చింతకాని మండలంలో మూడు లక్షల మంది రైతులతో భారీ రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను రైతులకు అందించాలనే లక్ష్యంతో స్టాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. రైతుల అభివృద్ధికి అవసరమైన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని, శాస్త్రవేత్తలు చెప్పే అంశాలను రైతులు శ్రద్ధగా విని గ్రామాలకు తీసుకెళ్లాలని కోరారు. ఆధునిక సాగు పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయంతో పాటు ఫిషరీస్, హార్టికల్చర్ తదితర అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… ఖమ్మం జిల్లాలో జూన్ 30న నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షాల కారణంగా జూలై 10వ తేదీకి వాయిదా పడిందన్నారు. తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద రైతు సభను చింతకాని మండలంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవడం లేదని, ఈ ఏడాది నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఎలా వ్యవసాయం చేయాలనే అంశాలపై వ్యవసాయ శాఖ శాస్త్రీయ సూచనలు అందిస్తోందన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైరా ప్రాజెక్టుకు గోదావరి జలాలు అందించాలని చేసిన విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని వినియోగించుకుంటూ రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను వైరా ప్రాజెక్టుకు తరలిస్తున్నామని, దీంతో వర్షాలతో సంబంధం లేకుండా దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. తక్కువ కాలంలో, తక్కువ నీటితో పండే పంటలను రైతులు సాగు చేయాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేయలేదని, రైతులు నష్టపోకుండా ఉండేందుకు డిప్యూటీ సీఎం రూ.5 వేల కోట్లు కేటాయించి మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేశారని తెలిపారు. మొక్కజొన్నతో పాటు జొన్న, సోయా తదితర పంటలను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. మొక్కజొన్న విక్రయించిన రైతుల ఖాతాల్లో మద్దతు ధర చెల్లింపులు రేపటిలోగా జమ చేస్తామని స్పష్టం చేశారు. జూలై 10న జరిగే రైతు ఆశీర్వాద సభ చారిత్రక ఘట్టమని, రైతులకు అవసరమైన ప్రతి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు ఆశీర్వాద సభకు లక్షలాది మంది రైతులు హాజరై విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఉద్యమాలు, పోరాటాలు, వ్యవసాయ రంగంలో ఖమ్మం జిల్లాకు ఘన చరిత్ర ఉందని, జిల్లాలో అత్యధికంగా ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందన్నారు. సంప్రదాయ పంటలతోపాటు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని, అధిక ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల ద్వారా వచ్చే వేతనం కంటే ఆయిల్‌పామ్ సాగుతో అధిక ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రకృతి సహకరించక పోయినా రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమకూరుస్తున్నామని, యూరియా యాప్ ద్వారా అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని సూచించారు. యూరియా యాప్ వల్ల దుర్వినియోగానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. రైతులకు వాతావరణ పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని, మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి విత్తనాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతను రైతులకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మెగా రైతు మేళా, రైతు ఆశీర్వాద సభ నిర్వహణకు అద్భుతమైన ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం, అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి మాట్లాడుతూ… వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను రైతులకు వివరించేందుకు ఈ మెగా రైతు మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదర్శ రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను ఇతర రైతులకు పరిచయం చేయడం కూడా ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. పంట మార్పిడి విధానం అమలు చేయడం, ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ… మెగా రైతు మేళా కోసం మొత్తం 150 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖతో పాటు హార్టికల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెగా రైతు మేళాకు 5 వేల మంది రైతులు వస్తారని అంచనా వేయగా దాదాపు 11 వేల మంది రైతులు హాజరయ్యారని తెలిపారు. రైతుల కోసం ఆధునిక వ్యవసాయ యంత్రాలు, సాంకేతిక పరికరాలను ప్రదర్శనకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు ఎలా సాధించాలి, ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగంలో ఎలా వినియోగించు కోవాలి అనే అంశాలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ… ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు విచ్చేయనున్నారని, ‘రైతు ఆశీర్వాదం’ పేరుతో మూడు లక్షల మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొంటూ, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్ధ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!