పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 13 2026: జగిత్యాల నిరుపేదలు, వృద్ధులు, మహిళలు, బీడీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను తక్షణమే అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దావా వసంత సురేష్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిరుపేద వర్గాలకు ఆసరా పెన్షన్ కేవలం రూ.200గా ఉండేదని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని పదింతలు పెంచి రూ.2,000 చేశారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పెన్షన్‌ను రూ.4,000కు పెంచుతామని, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 32 నెలలు గడిచినా ఆ హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఆగస్టు 15 నుంచి ఏడు రకాల పెన్షన్లలో వృద్ధాప్య పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన విమర్శించారు. మహిళలకు హామీ ఇచ్చిన రూ.2,500 పెన్షన్ ఊసే లేదన్నారు. బీడీ కార్మికుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రూ.2,000 పెన్షన్ అందించిందని జీవన్ రెడ్డి తెలిపారు. అలాగే నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించారని చెప్పారు. కళ్యాణ లక్ష్మి పథకంలో రూ.50 వేల నుంచి రూ.లక్షకు ఆర్థిక సహాయాన్ని పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా ఈ పథకాలను అమలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని, మహిళలకు రూ.2,500 అందిస్తామని హామీలు ఇచ్చి ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించిందని విమర్శించారు. వృద్ధుల సంక్షేమం విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. తల్లిదండ్రుల సంరక్షణ కోసం చట్టాలు రూపొందించిన ప్రభుత్వం, అదే వృద్ధుల సంక్షేమాన్ని విస్మరించడం సరికాదన్నారు. పెన్షన్ల పంపిణీపై చట్టబద్ధతకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలోకి వెళ్లినప్పటికీ ప్రభుత్వం కనీసం సమర్థవంతమైన కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. దశాబ్ద కాలంగా అమలవుతున్న కళ్యాణ లక్ష్మి పథకం విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి ద్వారా కేసీఆర్‌ను ప్రతి ఇంటి మేనమామగా ప్రజలు భావించారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. వృద్ధాప్య పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలను కొనసాగించలేకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. ఉత్తర తెలంగాణలో వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలను ప్రభుత్వం విస్మరించకూడదని ఆయన అన్నారు. మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులకు పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల అంశంపై వచ్చిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వ పనితీరుకు చెంపపెట్టు వంటివని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలను తగ్గించే కుట్రలో భాగంగానే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం నైతికత ఉన్నా బాధ్యత వహించి రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. వృద్ధాప్య పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్, మహిళలకు హామీ ఇచ్చిన రూ.2,500ను తక్షణమే అమలు చేయాలని కోరారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శీలం ప్రవీణ్ కుమార్, వోలమ్ మల్లేశం, గాజుల రాజేందర్, మున్నా, కళ్లేపల్లె దుర్గయ్య, కోరుకంటి రాము, తోట హరీష్, సతీష్ కుమార్, పల్లె రవి, రాధాకిషన్, గంగా రెడ్డి, పొనగంటి మహేష్, రమేష్ బాబు, బర్కం మల్లేశం, నరేష్ గౌడ్, కచ్చు హరీష్, సాయి, మహేష్, గుండా మధు, మధు, అనిల్, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి పథకాలను తక్షణమే అమలు చేయాలి: జీవన్ రెడ్డి
RELATED ARTICLES
