ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: సోయం వీరభద్రం
పొలిటికల్ పవర్, ములకలపల్లి, ఆగస్టు 31: ములకలపల్లి మండలం చౌటిగూడెం కాలనీకి చెందిన ఆదివాసి యువతి ఊకే శిరీష మృతదేహానికి బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శిరీష అంత్యక్రియల కోసం తన వంతు సహాయంగా రూ.5,000 నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ.. పేద కుటుంబం నుంచి వచ్చి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న శిరీష దారుణ హత్యకు గురికావడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. మంచి భవిష్యత్ ఉన్న ఆదివాసి యువతి అకాలంగా మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు పూర్తి బాధ్యత వహించిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
శిరీష పనిచేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపాలు ఉన్నాయనే ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని సోయం వీరభద్రం కోరారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం రుజువైతే బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
మహిళల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిశ, నిర్భయ వంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ, వాటి అమలులో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, నేరం జరిగిన వెంటనే దర్యాప్తును వేగవంతం చేసి బాధ్యులపై కఠిన శిక్షలు పడేలా చట్టపరమైన మార్పులు తీసుకురావాలని కోరారు.
శిరీష కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సోయం వీరభద్రం విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు డాక్టర్ మైపతి అరుణ్‌కుమార్, పూనెం శ్రీనివాస్, గుండు శరత్, ఊకే రవి, కుంజా ధర్మారావు, పోడియం బాలరాజు, కోర్సా నరసింహమూర్తి, కుంజా సంతోష్‌కుమార్, తంబళ్ల రవి, దారబోయిన రమేష్, మిడియం నారాయణ, సోంధే మల్లుదొర, మహిళాశక్తి నాయకురాలు కొండ్రు సుధారాణి, శీలం దుర్గ, కారం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

