పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 3 2026: పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులను ఆహ్వానిస్తూ ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి. సైదులు పాల్గొని నూతన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి. సైదులు మాట్లాడుతూ… కళాశాలలో అడుగుపెడుతున్న ప్రథమ సంవత్సరం విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఫ్రెషర్స్ పార్టీ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, విద్యార్థుల జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే ఆనందోత్సవమని పేర్కొన్నారు. విద్యార్థులు జ్ఞానం, క్రమశిక్షణ, మంచి విలువలు, ఉన్నత లక్ష్యాలను అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సీనియర్ విద్యార్థులు నూతన విద్యార్థులను తమ తమ్ముళ్లు, చెల్లెళ్లుగా భావించి ప్రేమతో ఆహ్వానించడం కళాశాల సంప్రదాయమని తెలిపారు. పరస్పర గౌరవం, సహకారం, స్నేహభావంతో విద్యార్థులంతా కలిసి చదువుకుంటే మంచి విజయాలు సాధించవచ్చని అన్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా అధ్యాపకులను ప్రశ్నిస్తూ, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని కోరారు. విద్యార్థుల్లోని ప్రతిభే కళాశాలకు గౌరవాన్ని తీసుకువస్తుందని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా విద్యార్థులు కష్టపడి చదవాలని, అధ్యాపకుల మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తూ మంచి పౌరులుగా ఎదగాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. ఫ్రెషర్స్ పార్టీని చక్కగా నిర్వహించిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో పాటు అధ్యాపక బృందాన్ని ప్రిన్సిపాల్ జి. సైదులు ప్రత్యేకంగా అభినందించారు. నూతన విద్యార్థులందరికీ ఈ విద్యా సంవత్సరం ఆనందకరంగా, విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, ప్రథమ సంవత్సరం విద్యార్థులు పాల్గొని సందడి చేశారు. నూతన విద్యార్థులకు సీనియర్లు ఆత్మీయ స్వాగతం పలకడంతో కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, తిరుపతయ్య, చెన్నకేశవులు, మహేందర్, రఘు, గోవర్ధన్, నరసింహస్వామి, సురేష్, సతీష్ కుమార్ మరియు అధ్యాపకతల బృందం శ్రీనివాసులు, రహీం, మంజులత మరియు పారిజాత తదితరులు పాల్గొన్నారు.
