పోలీసుల తీరుపై కాసాని నాగశేషా పద్మ తీవ్ర ఆగ్రహం.. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఫైర్
పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, సెప్టెంబర్ 07: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును అశ్వారావుపేట బీఆర్ఎస్ నాయకురాలు కాసాని నాగశేషా పద్మ తీవ్రంగా ఖండించారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాసాని నాగశేషా పద్మ మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని, జుట్టు పట్టుకుని లాగడం, గొంతు పట్టుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు తీవ్రంగా బాధించాయని అన్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పే ప్రభుత్వం.. మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ కల్పించలేకపోవడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ హామీల అమలుపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పోలీసు బలంతో అణచివేసే ప్రయత్నం చేస్తోందని కాసాని పద్మ విమర్శించారు. హామీల అమలులో వైఫల్యం, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, ప్రశ్నించే ప్రతిపక్ష గొంతుకలను అణచివేయడం ఇదేనా కాంగ్రెస్ పాలన అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణచివేసినంత మాత్రాన ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని ఆమె అన్నారు. ప్రజలు జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారని, ప్రభుత్వ పనితీరును ప్రజలే అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు ఉందని, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కాసాని నాగశేషా పద్మ అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని ఆమె హెచ్చరించారు.

